లేటుగా హీరోనయ్యాను .. అందుకే వరుసగా సినిమాలు చేశాను: మురళీ మోహన్

07-04-2020 Tue 15:14
  • ఒక ఏడాదిలో నా సినిమాలు 26 వచ్చాయి 
  • వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ వెళ్లేవాడిని 
  • రెండు షిఫ్టులు పనిచేశానన్న మురళీమోహన్
Murali Mohan

హీరోగా .. కేరక్టర్ ఆర్టిస్ట్ గా మురళీమోహన్ ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన కెరియర్ ను గురించిన విషయాలను పంచుకున్నారు. "తొలినాళ్లలో దాసరిగారు నాకు వరుసగా అవకాశాలను ఇచ్చి ప్రోత్సహించారు. నేను చేసిన సినిమాలు ఒక ఏడాదిలో 26 విడుదలయ్యాయి. మురళీ మోహన్ సినిమా ప్రతి శుక్రవారానికి ఒకటి వస్తుందని అనుకునేవారు.

నేను అలా వేగంగా సినిమాలు చేయడానికీ, వచ్చిన అవకాశాలను వదులుకోకపోవడానికి ఒక కారణం వుంది. నేను సినిమాల్లోకి లేటుగా ఎంట్రీ ఇచ్చాను. హీరోగా ఓ పది పదిహేనేళ్ల కంటే ఎక్కువగా ఉండలేం. 50 ఏళ్లు వచ్చాక ఇక కష్టమని గ్రహించి అలా చేశాను. అదృష్టం బాగుండి నేను చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం సక్సెస్ అయ్యాయి. రోజుకు రెండు షిఫ్టులు చేస్తూ వెళ్లేవాడిని. హీరోగా నిలదొక్కుకున్న తరువాత, కథల విషయంలో శ్రద్ధ తీసుకుంటూ వచ్చాను" అని చెప్పుకొచ్చారు.