‘కోవిడ్-19’పై పోరాటం నేపథ్యంలో.. మోదీకి సోనియా గాంధీ ఐదు సూచనలు

07-04-2020 Tue 17:15
  • ప్రభుత్వ వాణిజ్య ప్రకటనలను రెండేళ్ల పాటు రద్దు చేయాలి 
  • ఢిల్లీలోని ‘సెంట్రల్ విస్టా’ సుందరీకరణ పనులు ఆపాలి
  • రాష్ట్రపతి, ప్రధాని సహా సీఎంల విదేశీ పర్యనలు రద్దు చేయాలి
Sonia Gandhi suggestions to Modi

కోవిడ్-19పై వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం నేపథ్యంలో తగు సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించారు. ‘కరోనా’ పై పోరును సమర్థంగా కొనసాగించేందుకు అవసరమైన నిధుల సమీకరణకు ప్రధాని మరింత కఠినంగా వ్యవహరించాలని కోరుతూ.. ఈ మేరకు ఐదు సూచనలు చేస్తూ ఈ ఓ లేఖ రాశారు. ‘కరోనా’పై కేంద్రం జరుపుతున్న పోరాటానికి ఆమె సంఘీభావం తెలిపారు.

‘కరోనా’వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను పాటిస్తూ గొప్ప వ్యక్తులుగా నిలుస్తున్న పౌరులపై సోనియా ప్రశంసలు కురిపించారు. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలు పరస్పరం సహకరించుకోవాలని తద్వారా ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించాలని ఆ లేఖలో కోరారు. ఇక సోనియా చేసిన సూచనలు...

1. ప్రస్తుత సంక్షోభ సమయంలో టీవీ, ప్రింట్, ఆన్ లైన్ మీడియాకు ప్రభుత్వం తరఫున ఇచ్చే యాడ్స్ ను రెండేళ్ల పాటు పూర్తిగా రద్దు చేయాలి., ‘కరోనా’ మహమ్మారి కట్టడి నిమిత్తం ఇచ్చే ప్రకటనలు మాత్రం ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఏడాదికి సుమారు రూ.1,250 కోట్ల చొప్పున మీడియా అడ్వర్టైజ్ మెంట్లకు ఖర్చు చేస్తోంది (పీఎస్ యూలు, ప్రభుత్వ సంస్థలు చేసే యాడ్ వ్యయం కాకుండా...).

2. ఢిల్లీలో రూ.20 వేల కోట్లతో చేపడుతున్న పార్లమెంట్ భవన నిర్మాణం, ‘సెంట్రల్ విస్టా’ సుందరీకరణ కన్ స్ట్రక్షన్ ప్రాజెక్టు పనులను వెంటనే రద్దు చేయాలి. ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ భవనంలోనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమావేశాలను నిర్వహించుకోవచ్చు. కొత్త పార్లమెంట్ భవనాన్ని అత్యవసరంగా నిర్మించాల్సిన అవసరం లేదు. ఈ మొత్తాన్ని కొత్త ఆసుపత్రి నిర్మాణనికి, డయాగ్నస్టిక్స్ తో పాటు కోవిడ్ పై పోరాడుతున్న సిబ్బందికి పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్ (పీపీఈ) ను అందజేయడానికి, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు వినియోగించుకోవచ్చు.

3. ప్రభుత్వ వ్యయ బడ్జెట్ (ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు కాకుండా) నుంచి 30 శాతం ఖర్చులు తగ్గించుకుని ఆ మొత్తాన్ని (ఏడాదికి సుమారు రూ.2.5 లక్షల కోట్లు) వలస కార్మికులు, రైతులు, చిన్న పరిశ్రమలకు ఆర్థిక భద్రత కల్పించే విధంగా కేటాయింపులు జరపాలి.

4. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు సహా ప్రభుత్వ ఉన్నతాధికారుల విదేశీ పర్యటనలు రద్దు చేయాలి. ఈ సొమ్మును ‘కరోనా’పై పోరుకు వినియోగించాలి

5. ‘పీఎం కేర్స్ ఫండ్’ కు వచ్చిన విరాళాల మొత్తాన్ని పీఎం రిలీఫ్ ఫండ్ కు బదిలీ చేయాలి. అందులో పారదర్శకత, జవాబుదారీతనం, ఆడిట్ ఉండేలా చూడాలని తన లేఖలో సోనియా సూచించారు.