నేను కూడా ఇందులో భాగమైనందుకు సంతోషంగా ఉంది: 'ఫ్యామిలీ' షార్ట్ ఫిలింపై చిరంజీవి

07-04-2020 Tue 14:34
  • అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రధారిగా ఫ్యామిలీ షార్ట్ ఫిలిం
  • తమ ఇళ్లలోనే ఉండి నటించిన సూపర్ స్టార్లు
  • లక్ష మంది సినీ కార్మికులకు ఉపకరిస్తుందన్న మెగాస్టార్
Chiranjeevi responds on acting in Family short film

బాలీవుడ్ స్టార్ ఫిలింమేకర్ కరణ్ జొహార్ దేశంలోని అందరు స్టార్లతో 'ఫ్యామిలీ' అనే షార్ట్ ఫిలింను రూపొందించిన సంగతి తెలిసిందే. కరోనా సహాయక చర్యలకు నిధుల సేకరణ ఉద్దేశంతో ఈ షార్ట్ ఫిలింను నిర్మించారు. సోనీ టీవీ చానల్లో విడుదలైన ఫ్యామిలీకి విశేష స్పందన వస్తోంది. ఇందులో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి తదితరులు తమ ఇళ్లలోనే ఉండి నటించారు.

దీనిపై చిరంజీవి స్పందించారు. ఈ అద్భుతమైన కార్యాచరణలో తాను కూడా భాగం అయ్యానని, అందుకు ఎంతో సంతోషిస్తున్నానని పేర్కొన్నారు. ఈ షార్ట్ ఫిలిం ద్వారా వచ్చే ఆదాయం భారత సినీ పరిశ్రమకు చెందిన లక్ష మంది సినీ కార్మికులకు ఊరట కలిగిస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సోనీ పిక్చర్స్ నెట్ వర్క్ ఇండియా, కల్యాణ్ జ్యుయెల్లర్స్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు ట్వీట్ చేశారు.