ఇక ‘వకీల్ సాబ్’ వచ్చేది ఆగస్టులోనే!

07-04-2020 Tue 14:17
  • లాక్‌డౌన్‌తో ఆగిన పవన్ సినిమా షూటింగ్
  • మరిన్ని సినిమాల విడుదల కూడా వాయిదా
  • జూలైలో రానున్న నాగచైతన్య ‘లవ్ స్టోరీ’!
pawan kalyan new movie vakeel saab to be release in august

రాజకీయాల్లో అడుగుపెట్టిన కారణంగా కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బాలీవుడ్ సినిమా ‘పింక్’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ న్యాయవాది పాత్రలో నటిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్ లుక్, ఓ పాటకు విపరీతమైన ఆదరణ లభించింది. దాంతో, పవన్‌ను మళ్లీ తెరపైన ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే, లాక్‌ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోడవంతో ఈ  చిత్రం కొంత ఆలస్యం కానుంది. లాక్‌ డౌన్ ముగిసిన వెంటనే మిగిలిన షూటింగ్‌  పూర్తి చేసి ఆగస్టులో సినిమాను విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నట్టు సమాచారం.

లాక్‌డౌన్ దెబ్బకు షూటింగ్స్ మొత్తం నిలిచిపోవడం, సినిమా థియేటర్లు బంద్ కావడంతో చాలా చిత్రాల విడుదల వాయిదా పడింది. ఇప్పుడు కొత్త తేదీల గురించి టాలీవుడ్ నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ‘లవ్‌ స్టోరీ’ని తొలుత వేసవి కానుకగా మే 29న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, ఇప్పటికే విడుదల కావాల్సిన కొన్ని సినిమాలు మే నెలలో రిలీజయ్యే అవకాశం ఉండడంతో ‘లవ్ స్టోరీ’ వెనక్కు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను జూలైలో విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోందని సమాచారం.