whatsapp: కరోనా ఫేక్‌ న్యూస్‌ను కట్టడి చేయడానికి యాప్‌లో మార్పులు చేసిన వాట్సప్‌!

  • ఒక్కో మెసేజ్‌ ఒకే సమయంలో ఒకరికి మాత్రమే ఫార్వర్డ్ చేసే అవకాశం
  • ఇప్పటికే పలు ఫీచర్లు తీసుకొచ్చిన వాట్సప్‌
  • లాక్‌డౌన్‌ నేపథ్యంలో పెరిగిపోయిన వాట్సప్‌ వినియోగం
WhatsApp Reduces Forward Message Limit to One Chat at Time With Aim to Curb Fake News During COVID19 Outbreak

ఫేక్‌ న్యూస్‌ ప్రచారం కాకుండా ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకుని ఫీచర్లలో మార్పులు తీసుకొచ్చిన వాట్సప్‌ తాజాగా మరో అడుగు వేసింది. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో వాట్సాప్‌లో తప్పుడు సమాచారం ప్రచారం కాకుండా ఫీచర్లలో మరో మార్పు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఒక్కో మెసేజ్‌ను ఒకే సమయంలో మరొక్క నంబర్‌కే ఫార్వడ్‌ చేసేలా ఫీచర్‌ తీసుకొచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభణతో తీసుకుంటున్న చర్యల వల్ల ప్రస్తుతం ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలో స్నేహితులు, బంధువులకు మెసేజ్‌లు పంపడానికి వాట్సప్‌ను బాగా వాడేస్తున్నారు. అలాగే, ఇతర సోషల్ మీడియా యాప్‌లను కూడా బాగా వాడుతున్నారు. ఈ నేపథ్యంలో అసత్య ప్రచారం వ్యాప్తి చెందకుండా ప్రపంచ దేశాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో వాట్సప్‌ తమ ఫీచర్‌లో మార్పులు చేసింది. గతంలో వాట్సప్‌లో అసత్య ప్రచారం వ్యాప్తి చెందుతుండడంతో ఒక్కో మెసేజ్‌కు ఒకే సమయంలో కేవలం ఐదుగురికి మాత్రమే ఫార్వర్డ్‌ చేసేలా వాట్సప్‌ తమ ఫీచర్‌ను మార్చిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్‌ను భారత్‌లో వాట్సప్‌ 2018 ఆగస్టులో తీసుకొచ్చింది. అనంతరం గత ఏడాది జనవరిలో ప్రపంచ వ్యాప్తంగా ఇదే ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇప్పుడు అదే ఫీచర్‌ను మరింత కుదించింది.

ఇలా చేస్తే అసత్య ప్రచారం జరగకుండా కాస్తయినా నిరోధించవచ్చని భావిస్తోంది. ఒకే మెసేజ్‌ను చాలా మంది మిత్రులకు పంపాలని యూజర్లు అనుకుంటే దాన్ని కాపీ చేసి ఒక్కో మెసేజ్‌ను ఒక్కోసారి ఒక్కో మిత్రుడికి పంపుకోవచ్చు. లేదంటే ఒకరికి ఫార్వర్డ్‌ చేసిన తర్వాత మళ్లీ మొదటి మెసేజ్‌ వద్దకు వెళ్లి మరొకరికి ఫార్వర్డ్‌ చేసుకోవచ్చు.

యూజర్లకు వచ్చే మెసేజ్‌ను పంపిన వారు సొంతంగా టైప్‌ చేసి పంపారా? లేక ఫార్వర్డ్‌ చేశారా? అన్న విషయాన్ని తెలుపుతూ ఇప్పటికే వాట్సప్‌ ఫీచర్‌ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తమకు వచ్చిన మెసేజ్‌పై ఫార్వర్డ్‌ అనే అక్షరాలు కనిపిస్తే దాన్ని పంపిన వారు సొంతంగా కాకుండా తమకు వచ్చిన మెసేజ్‌ను షేర్‌ చేశారని తెలుసుకోవచ్చు. దీని వల్ల కూడా అసత్య ప్రచారం తగ్గుముఖం పడుతుందని వాట్సప్ భావిస్తోంది.

More Telugu News