Maharashtra: మహారాష్ట్ర సీఎం ఇంటి సమీపంలో కలకలం.. టీ అమ్మే వ్యక్తికి కరోనా.. క్వారంటైన్‌కు 170 మంది సిబ్బంది!

Coronavirus COVID19 Maharashtra Uddhav Thackerays Security Men Quarantined As Tea Seller Tests Positive For COVID19
  • ముంబై, బాంద్రాలో వున్న 'మాతోశ్రీ' నివాసం
  • మొత్తం శుభ్రం చేస్తోన్న మున్సిపల్ సిబ్బంది
  • స్వయంగా కారు నడుపుతూ సామాజిక దూరం పాటిస్తోన్న ఉద్ధవ్‌
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే ప్రైవేటు నివాసం వద్ద కలకలం చెలరేగింది. ముంబై, బాంద్రా‌లోని ఆయన నివాస గృహం 'మాతోశ్రీ' సమీపంలో టీ అమ్మే వ్యక్తికి కరోనా సోకింది. ఉద్ధవ్‌ భద్రతా సిబ్బందితో పాటు ఇతర సిబ్బంది అతడి వద్దే టీ తాగుతారు. దీంతో దాదాపు 170 మంది స్టేట్‌ రిజర్వ్‌ పోలీసులతో పాటు ఇతరులను అక్కడి నుంచి పంపించేశారు.

వారందరినీ ఉత్తర భారతీయ సంఘం భవనంలో క్వారంటైన్‌లో ఉంచినట్లు అక్కడి అధికారులు తెలిపారు. వారి నుంచి నమూనాలు తీసుకున్న వైద్య సిబ్బంది, వారికి కరోనా సోకిందా? అన్న విషయాన్ని నిర్ధారించే పనిలో ఉన్నారు.

టీ అమ్మే వ్యక్తి ఇటీవల జ్వరం, దగ్గు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు పడుతుండడంతో ముంబైలోని ఓ ఆసుపత్రిలో అతడిని చేర్పించారు. దీంతో అతనికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అంతకు ముందు అతని టీ స్టాల్‌ వద్ద ఉద్ధవ్‌ థాకరే భద్రతా సిబ్బంది టీ తాగారు. వారిలో కరోనా లక్షణాలు కనపడకపోయినప్పటికీ వారిని క్వారంటైన్‌లో ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

కొందరిలో కరోనా లక్షణాలు చాలా ఆలస్యంగా కనపడుతున్నాయి. మరికొందరిలో లక్షణాలు కనపడకపోయినప్పటికీ కరోనా నిర్ధారణ అయిన ఘటనలూ ఉన్నాయి. సీఎం నివాస ప్రాంతంలో ముంబై మున్సిపల్ సిబ్బంది ఇప్పటికే శానిటైజ్‌ పనులు ప్రారంభించారు. ఆ ప్రాంతంలోకి ఎవరినీ రాకుండా ఆంక్షలు విధించారు. క్రిమిసంహారక మందును స్ప్రే చేస్తున్నారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉద్ధవ్‌ థాకరేతో పాటు ఆయన భద్రతా సిబ్బంది కూడా సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. అంతేకాదు. ఉద్ధవ్‌ థాకరే స్వయంగా కారు డ్రైవ్‌ చేసుకుంటూ కార్యాలయానికి వెళ్తున్నారు. ఆయన వెంట ఇతర కారుల్లో భద్రతా సిబ్బంది వస్తున్నారు. ఉద్ధవ్‌ కుమారుడు, మంత్రి ఆదిత్య థాకరే కూడా మాతోశ్రీలోనే నివసిస్తున్నారు.
Maharashtra
Uddhav Thackeray
Corona Virus

More Telugu News