సైకిల్‌ కోసం జమ చేసుకున్న రూ.971ను ఏపీ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇచ్చిన నాలుగేళ్ల చిన్నారి

07-04-2020 Tue 13:22
  • పేర్ని నానిని కలిసిన బాలుడు
  • అభినందించిన మంత్రి
  • చిన్నారితో కాసేపు మాట్లాడిన మంత్రి 
Andhra Pradesh A 4 year old boy Hemanth has donated his savings of Rs 971

కరోనా విజృంభణ నేపథ్యంలో పిల్లలు కూడా ప్రభుత్వాలకు సాయం చేస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయనిధికి ఓ చిన్నారి (4) ఈ రోజు విరాళం ఇచ్చాడు. కుటుంబ సభ్యులు అప్పుడప్పుడు ఇచ్చిన చిల్లర డబ్బులను సైకిల్‌ కొనుక్కోవడానికి దాచిపెట్టుకుంటున్న హేమంత్‌ అనే చిన్నారి.. కరోనాతో ఆకలితో అలమటిస్తోన్న వారికి ఆ డబ్బు ఉపయోగపడుతుందని ఆలోచించాడు.

దీంతో తాను ఇన్నాళ్లు జమ చేసుకున్న రూ. 971లను సీఎం రిలీఫ్‌ పండ్‌కు విరాళంగా ఇచ్చాడు. ఈ రోజు ఉదయం తన తల్లిదండ్రులతో కలిసి తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయానికి వచ్చిన హేమంత్‌ ఈ విరాళాన్ని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి పేర్ని నానికి అందజేశారు. ఆ చిన్నారిని మంత్రి అభినందించారు. తన టేబుల్‌పై ఆ బాలుడిని కూర్చోబెట్టి కాసేపు మాట్లాడారు.

కాగా, ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ప్రజలు కూడా విరాళాలు ప్రకటిస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు. ఏపీలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 304కు చేరింది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది.