ఆ పాత్రకు ఎవరు బాగుంటారని 10 మందిని అడిగితే, 9 మంది నుంచి ఒకే సమాధానం: రాజమౌళి

07-04-2020 Tue 12:47
  • 'ఆర్ఆర్ఆర్'లో నటిస్తున్న అజయ్ దేవగణ్
  • ఓ కీలక పాత్ర కోసం ఎవరిని అడిగినా అజయ్ పేరే వచ్చింది
  • అడగ్గానే అంగీకరించారన్న రాజమౌళి
Rajamouli Shares Interesting Thing About Ajay Devagan In RRR

దర్శక దిగ్గజం రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో పాటు బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ కూడా నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఈ పాత్ర కోసం అజయ్ ని సంప్రదించడానికి గల కారణంపై ఓ ఆసక్తికర విషయాన్ని రాజమౌళి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

"ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్ర ఉంటుంది. దాని కోసం ఎవరిని తీసుకోవాలా? అని ఎన్నో రోజులు ఆలోచించాము. ముఖంలో నిజాయతీతో పాటు ధైర్యం, సమగ్రత కొట్టొచ్చినట్టు కనిపించాలి. ఈ పాత్రకు ఉండాల్సిన లక్షణాల గురించి కొందరికి వివరించి, ఎవరైతే బాగుంటుందని ప్రశ్నించాను. పది మందిలో తొమ్మిది మంది అజయ్ దేవగణ్ పేరే చెప్పారు. ఆయన్ను అడగ్గానే ఒప్పుకున్నారు. నాకెంతో సంతోషం కలిగింది. అజయ్ చాలా అంకితభావం ఉన్న నటుడు" అని రాజమౌళి వ్యాఖ్యానించారు.