ముందు మనకు అవసరమైన మందుల్ని అందుబాటులో వుంచుకోవాలి: ఎగుమతులపై రాహుల్ గాంధీ

07-04-2020 Tue 12:25
  • విదేశాలకు భారత్‌ ఔషధ ఎగుమతులపై స్పందన
  • స్నేహం అంటే ప్రతీకారం కాదు
  • ఈ విపత్కర పరిస్థితుల్లో సాయం మంచిదే
India must help all nations but lifesaving medicines should be made available to Indians first Rahul Gandhi

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌తో పాటు పలు రకాల ఔషధాల ఎగుమతులపై భారత్‌ నిషేధం విధించడం, మళ్లీ దీనిపై కాస్త వెనక్కి తగ్గడం పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. 'స్నేహం అంటే ప్రతీకారం కాదు.. ఈ విపత్కర పరిస్థితుల్లో భారత్‌ అన్ని దేశాలకు సాయం చేయాలి.. అయితే, ప్రాణాధార ఔషధాలను మొదట భారతీయులకు విస్తృతంగా అందుబాటులో ఉంచాలి' అని ఆయన ట్వీట్ చేశారు.
 
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు ఔషధాలకు డిమాండ్ పెరగడంతో పలు దేశాలు భారత్‌ వైపు చూస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ భారత్‌ను హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ కావాలని కోరడం, పలు ఔషధాల ఎగుమతులు చేయబోమని ఆ వెంటనే భారత్‌ నుంచి ప్రకటన రావడం చర్చనీయాంశంగా మారింది. 

తాము ప్రతీకారం తీర్చుకుంటామనేలా ట్రంప్‌ మాట్లాడడంతో భారత్‌ దీనిపై పునరాలోచన చేసింది. కరోనా విజృంభణతో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న పలు దేశాలకు అవసరమైన డ్రగ్స్‌ అందజేస్తామని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ ఈ విధంగా స్పందించారు.