లాక్‌డౌన్‌లో ఫ్యామిలీతో కలిసి బీచ్‌కు.. న్యూజిలాండ్ మంత్రికి డిమోషన్!

07-04-2020 Tue 12:25
  • మంత్రి డేవి క్లార్క్‌ పై చర్యలు తీసుకున్న ఆ దేశ ప్రధాని
  • ఆరోగ్య శాఖ నుంచి తొలగింపు
  • ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా నియామకం
New Zealand Minister Demoted who Drove Family To Beach in Lockdown

ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నప్పుడు ప్రజలు సహకరించాలని  ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తుంటాయి. నిబంధనలు పాటించాలని కోరుతాయి. కానీ, ఆంక్షలు విధించిన ప్రభుత్వ పెద్దలే కొన్నిసార్లు వాటిని ఉల్లంఘిస్తుంటారు. అలాంటిదే న్యూజిలాండ్‌లోనూ జరిగింది. కరోనా కట్టడికి ఆ దేశంలో పూర్తిగా లాక్ డౌన్ విధించారు. అయితే, ఎంతో బాధ్యత కలిగిన ఆదేశ ఆరోగ్య శాఖ మంత్రే దాన్ని ఉల్లంఘించి డిమోషన్‌కు గురయ్యారు.

 తనపై తానే ‘ఇడియట్’ అనే ముద్ర వేసుకున్న న్యూజిలాండ్ ఆరోగ్య శాఖ మంత్రి డేవిడ్ క్లార్క్ తరచూ వివాదాల్లో ఉంటారు. ఐసోలేషన్‌లో ఉండాల్సిన సమయంలో మౌంటైన్ బైకింగ్‌కు వెళ్లి విమర్శల పాలైన ఆయన ఇటీవలే లాక్ డౌన్ రూల్స్‌ బ్రేక్ చేశారు. తన కుటుంబంతో కలిసి 20 కిలో మీటర్లు ప్రయాణించి బీచ్‌ వాక్‌ చేసినట్టు చెప్పారు. దీంతో ఆయనపై న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జెసిండా ఆర్డర్న్ చర్యలు తీసుకున్నారు.

 క్లార్క్ ను ఆరోగ్య శాఖ నుంచి తప్పించి ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా నియమించారు. సాధారణ పరిస్థితుల్లో అయితే.. డేవిడ్‌ ను మంత్రి వర్గం నుంచి పూర్తిగా తొలగించే వాళ్లమని ఆమె చెప్పారు. కరోనాపై పోరాడుతున్నప్పుడు ఆయన సహకారం ఉందన్నారు.