Pakistan: కరోనా రక్షణ పరికరాలు కావాలంటూ పాక్ లో వైద్యుల ఆందోళన.. లాఠీఛార్జ్‌, అరెస్ట్‌!

  • బలూచిస్థాన్‌ రాజధాని క్వెట్టా నగరంలో ఘటన
  • తమకు సరైన సదుపాయాలు లేవని వైద్యుల నిరసన
  • సమర్థించుకున్న బలూచిస్థాన్‌ ప్రభుత్వం 
police arrests doctors in pak

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ రాజధాని క్వెట్టా నగరంలో దాదాపు 50 మందికిపైగా వైద్యులను పోలీసులు అరెస్టు చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి పనిచేస్తోన్న తమకు వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ), మాస్కులు వంటి సరైన సదుపాయాలు లేవని నిరసన తెలపడమే వారు చేసిన తప్పు. వైద్య సిబ్బందికి అవసరమైన పరికరాలను అందించాల్సిన ప్రభుత్వం వాటిని అందించకపోగా కరోనా రోగులకు వైద్యం చేస్తోన్న వారిపైనే లాఠీచార్జ్‌ చేసి అరెస్టు చేయడం పట్ల విమర్శలు వస్తున్నాయి.
 
 పీపీఈ కిట్లను అందించాలని కొన్ని వారాలుగా వైద్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నప్పటికీ ప్రభుత్వం వారి విజ్ఞప్తిని పట్టించుకోలేదు. చివరకు ఆసుపత్రి ముందే వైద్యులు నిరసన తెలిపారు. అక్కడి నుంచి సీఎం ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకురావాలనుకున్నారు. దీంతో అక్కడకు వచ్చిన పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు.

దీనిపై స్పందించిన బలూచిస్థాన్‌ ప్రభుత్వం.. పీపీఈ కిట్ల కొరత ఉన్న విషయం నిజమేనని తెలిపింది. వీటి కొరత తీర్చడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని చెప్పింది. ఈ లోపే 144 సెక్షన్‌ను వైద్యులు ఉల్లంఘించారని, అందుకే ఆరెస్ట్‌ చేయాల్సి వచ్చిందని ప్రకటించింది. మొత్తం 53 మంది వైద్యులు చట్టాన్ని ఉల్లంఘించారని చెప్పుకొచ్చింది.

ఈ ఘటనపై స్పందించిన యువ వైద్యుల అసోసియేషన్‌ (వైడీఏ) అన్ని వైద్య సేవలను వెంటనే బాయ్‌కాట్‌ చేయాలని నిర్ణయం తీసుకుని ప్రకటన చేసింది. దీంతో పాక్‌లో ఈ సమస్య మరింత క్లిష్టమయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి.

కాగా, పాకిస్థాన్‌ వ్యాప్తంగా వైద్య సిబ్బంది పీపీఈల కోసం విజ్ఞప్తులు చేస్తున్నారు. పాక్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. ఇప్పటివరకు ఆ దేశంలో 3,469 మందికి కరోనా సోకింది. 50 మంది మృతి చెందారు.

More Telugu News