నేనూ లుంగీ ధరించి ఇంటి నుంచి పని చేస్తా: ఆనంద్ మహీంద్ర

07-04-2020 Tue 11:53
  • వర్క్ ఫ్రమ్ హోమ్ పై మీమ్ ను షేర్ చేసిన కార్పొరేట్ దిగ్గజం
  • వీడియో కాల్స్ లో మాట్లాడేప్పుడు లుంగీ, చొక్కా వేసుకుంటానని వెల్లడి
  • వైరల్ గా మారిన ఆయన ట్వీట్
cconfesses he wears lungi during Work From Home video calls

కరోనా వైరస్ కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో చాలా మంది ఉద్యోగులు ఇప్పుడు ఇంటి నుంచే పని చేస్తున్నారు. ఆఫీసుకు వచ్చేటప్పుడు సూటు, బూటు వేసుకునే వాళ్లు.. ఇప్పుడు ఇంట్లో తమకు సౌకర్యంగా ఉండే బట్టలు వేసుకొని పని కానిచ్చేస్తున్నారు. వేసవి కావడంతో చాలా మంది పైజామాలు, లుంగీలు ధరిస్తున్నారు.

మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర కూడా ఇదే కేటగిరీలో ఉన్నారు. ఈ విషయంలో ఇటీవల నెట్‌లో ట్రెండ్ అవుతున్న మీమ్‌ను షేర్ చేసిన ఆయన ఆసక్తికర విషయాన్ని బయట పెట్టారు. ఆ మీమ్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే సూటు బూటు వేసుకొని స్టయిల్‌గా కూర్చొని పని చేస్తారని అనుకుంటారని, కానీ, వాస్తవానికి వచ్చే సరికి లుంగీ, బనియన్ వేసుకొని వంట చేస్తూనే లాప్‌టాప్‌లో పని కానిచ్చేస్తారన్నట్టు ఫొటోలు ఉన్నాయి.

దీన్ని ట్విట్టర్ లో షేర్ చేసిన ఆనంద్.. ‘సరదాగా చెబుతున్నా. ఇది నా వాట్సప్‌ వండర్ బాక్స్‌కు వచ్చిన మెసేజ్. ఇక్కడ నేను ఓ విషయాన్ని అంగీకరించాలి. ఇంటి నుంచి వీడియో కాల్స్ అటెండ్‌  అయ్యేటప్పుడు నేను కూడా చొక్కా కింద లుంగీనే ధరిస్తా. ఎందుకంటే మీటింగ్ టైమ్‌లో లేచి నిల్చోవాల్సిన అవసరం ఉండదు కదా. కానీ, ఈ ట్వీట్ చూశాక మా కొలీగ్స్‌ నన్ను నిల్చోమంటారేమో’ అంటూ చమత్కరించారు.

ఈ ట్వీట్ వెంటనే వైరల్ అయింది. తాను కూడా లుంగీ ధరించి ఇంటి నుంచి పని చేస్తానని ఆనంద్ మహీంద్ర చెప్పడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. ‘మీరు కూడా లుంగీ ధరిస్తారా!’ అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈసారి లుంగీ వేసుకున్నప్పుడు మీ లుంగీ డ్యాన్స్ వీడియో షేర్ చేయండి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.