భారత్ నుంచి స్వదేశానికి 1300 మంది అమెరికన్లు

07-04-2020 Tue 11:01
  • ప్రత్యేక విమానాల్లో చేరవేత
  • దక్షిణ, మధ్య ఆసియా నుంచి కూడా స్వదేశానికి తిరుగు పయనం 
  • వెల్లడించిన అమెరికా సీనియర్ దౌత్యవేత్త
1300 Americans Return Home From India On Special Flights says US Official

కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా చాలా దేశాలు లాక్‌ డౌన్ ప్రకటించాయి. దాంతో, వివిధ పనుల నిమిత్తం వచ్చిన ఇతర  దేశాలకు చెందిన ప్రజలు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. అలా దక్షిణ, మధ్య ఆసియా దేశాల్లో చిక్కుకున్న తమ పౌరులను తిరిగి స్వదేశానికి తరలిస్తున్నామని అమెరికా తెలిపింది. ప్రత్యేక విమానాల ద్వారా దాదాపు 29 వేల మందిని అమెరికా తీసుకెళ్లినట్టు ఆ దేశానికి చెందిన సీనియర్ దౌత్యవేత్త అలైస్ వేల్స్ ప్రకటించారు. ఇందులో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, ఉజ్బెకిస్థాన్, తుర్క్‌మెనిస్థాన్ నుంచి 2900 మంది యూఎస్ సిటిజన్స్‌ను వెనక్కి రప్పించినట్టు తెలిపారు

‘భారత్‌లో వివిధ ప్రాంతాల్లో ఉన్న వేలాది మంది అమెరికన్లు సాయం చేయాలని కోరుతున్నారు. మేం వారికి సానుకూలంగా స్పందిస్తున్నాం. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నప్పటికీ  ఇండియా నుంచి ఇప్పటిదాకా 1300 మందిని స్వదేశానికి తీసుకెళ్లాం’ అని చెప్పారు.

కొవిడ్-19పై పోరాటంలో భారత్, అమెరికా కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని అలైస్ అన్నారు. డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో ఈ విషయంపై స్పష్టత వచ్చిందని ఆమె అభిప్రాయపడ్డారు.

 ఔషధ రంగంలో అమెరికాకు భారత్ కీలక భాగస్వామి అన్నారు. 2018 నుంచి భారత్‌ నుంచే అమెరికా అత్యధిక ఔషధాలు దిగుమతి చేసుకుంటోందని చెప్పారు. జెనరిక్ డ్రగ్స్ తయారీలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని, యూఎస్ మార్కెట్‌కు ఇక్కడి నుంచే ఎక్కువ ఔషధాలు సరఫరా అవుతాయని ఆమె చెప్పారు.

తమకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను విడుదల చేయకపోతే భారత్‌పై ప్రతికారం తీర్చుకోవచ్చని ట్రంప్‌ చెప్పిన తర్వాత  కూడా అలైస్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.