'తమ్ముడు' అడిగితే ఆ సినిమా ఇచ్చేస్తానంటున్న 'అన్నయ్య'!

07-04-2020 Tue 10:57
  • మలయాళంలో విజయవంతమైన 'లూసిఫర్'
  • నచ్చి రీమేక్ రైట్స్ కొనుగోలు చేసిన చిరంజీవి
  • పవన్ కల్యాణ్ ఆ సినిమా చేస్తారన్న వార్తలపై మెగాస్టార్ స్పందన
Chiranjeevi Comments on Lucifer Remake With Pawan Kalyan

తన సోదరుడు పవన్ కల్యాణ్ కోరితే, తాను చేయాలనుకుంటున్న రీమేక్ చిత్రాన్ని తనకి వదులుకుంటానని మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం 'ఆచార్య' చిత్రంలో నటిస్తున్న ఆయన, మలయాళంలో మోహన్ లాల్ నటించిన 'లూసిఫర్' నచ్చడంతో, హక్కులను కొన్నారు. ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారన్న విషయమై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఈలోగా ఈ సినిమాను పవన్ కల్యాణ్ తో తీస్తారన్న టాక్ టాలీవుడ్ లో మొదలైంది. తాజాగా, చిరంజీవిని ఇదే విషయమై ప్రశ్నించగా, ఆయన స్పందించారు. ఈ సినిమాను తానే చేస్తానని తెలిపిన ఆయన, తన కోసమే రీమేక్ హక్కులను కొన్నారని, ఇదే సమయంలో పవన్ కు ఈ సినిమా చేయాలన్న ఆసక్తి ఉంటే, తాను వదిలేసుకునేందుకు సిద్ధమని అన్నారు. ఈ విషయంలో పవన్ ఇంకా స్పందించాల్సివుంది. ప్రస్తుతం ఆయన 'వకీల్ సాబ్', దీనికి సమాంతరంగా క్రిష్ దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆపై హరీశ్ శంకర్ సైతం లైన్ లో ఉన్నారు.

'లూసిఫర్'లో మోహన్ లాల్ తో పాటు పృథ్వీరాజ్ నటించగా, పృథ్వీరాజ్ చేసిన పాత్రలో రామ్ చరణ్ నటిస్తారని కూడా టాక్ వినిపిస్తోంది.