Boston Consulting Group: లాక్‌డౌన్‌పై వైరల్ అవుతున్న వార్తలను ఖండించిన బోస్టన్ గ్రూప్

  • లాక్‌డౌన్ పొడిగించే అవకాశం ఉందన్న బోస్టన్ గ్రూప్
  • నిన్నటి మీడియా సమావేశంలో కేసీఆర్ ప్రస్తావన
  • తాము ఎటువంటి అధికారిక  నివేదిక ఇవ్వలేదన్న బీసీజీ
Boston Group denies lockdown news

లాక్‌డౌన్ పొడిగింపు విషయంలో తమ పేరుతో ప్రచారం అవుతున్న వార్తలను బోస్టన్ కన్సల్టెంగ్ గ్రూప్ (బీసీజీ) ఖండించింది. ఆ వార్తలతో తమకు ఎటువంటి సంబంధం లేదని, లాక్‌డౌన్ పొడిగింపుపై తాము ఎటువంటి అధికారిక అంచనాలు వెలువరించలేదని స్పష్టం చేసింది. భారత్ లాంటి దేశాల్లో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలతో కోవిడ్ నియంత్రణ అసాధ్యమని, వైరస్ అడ్డుకట్టకు తీసుకుంటున్న చర్యలు కూడా అంత ప్రభావం చూపడం లేదని, కాబట్టి దేశంలో లాక్‌డౌన్‌ను సెప్టెంబరు వరకు పొడిగించే అవకాశం ఉందని బోస్టన్ గ్రూప్ పేర్కొన్నట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి.

అంతేకాదు, జూన్ మూడో వారం నాటికి దేశంలో కరోనా వైరస్ మరింత చెలరేగుతుందని, కేసుల సంఖ్య పతాక స్థాయికి చేరుకుంటుందని కూడా బీసీజీ నివేదిక పేర్కొన్నట్టు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. ఈ వార్తలపై తాజాగా బీసీజీ స్పందించింది. లాక్‌డౌన్ పొడిగింపుపై తాము ఎలాంటి అధికారిక నివేదిక ఇవ్వలేదని, ఎవరూ ఆ వార్తలను విశ్వసించవద్దని కోరింది. అయితే, బీసీజీ నివేదికను నిన్నటి మీడియా సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రస్తావించడం విశేషం.

More Telugu News