Jitendra Kumar Rathod: కరోనా సోకి.. యూకేలోని ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్ జితేంద్ర కుమార్ కన్నుమూత!

UKs Famous Doctor Jitendra Kumar Died with Corona
  • హృద్రోగ నిపుణుడిగా జితేంద్రకు ఎంతో పేరు
  • ఇటీవల కరోనా సోకడంతో ఐసీయూలో చికిత్స
  • 1977లో ఇండియాలోనే వైద్య విద్య, ఆపై బ్రిటన్ లో స్థిరపడిన జితేంద్ర
హృద్రోగ నిపుణుడిగా, బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీసెస్ లో ఎంతో కాలం నుంచి అసోసియేట్ స్పెషలిస్ట్ గా విధులు నిర్వహిస్తూ, ఎందరో ప్రముఖులకు వైద్య సేవలందించిన డాక్టర్ జితేంద్ర కుమార్ రాథోడ్, కరోనా వైరస్ సోకి, ఈ ఉదయం మరణించారు. ఈ విషయాన్ని వెల్లడించిన కార్డిఫ్ అండ్ వేల్ యూనివర్శిటీ హెల్త్ బోర్డు, "ఇదొక దుర్వార్త. కార్డియో - థారోసిక్ సర్జరీలో ఎంతో అనుభవజ్ఞులైన జితేంద్ర ప్రసాద్ ఇక లేరు. వేల్స్ లోని యూనివర్శిటీ హాస్పిటల్ లో ఆయన తుది శ్వాస విడిచారు" అని ప్రకటించింది.

1977లో బాంబే యూనివర్శిటీలో వైద్య విద్యను అభ్యసించిన జితేంద్ర కుమార్, ఆపై యూకేకు వెళ్లి, వైద్య రంగంలో దశాబ్దాల పాటు సేవలందించారు. ఇటీవల ఆయనకు కరోనా వైరస్ సోకగా, జనరల్ ఇన్టెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచి చికిత్సను అందించారు. తన వద్దకు వచ్చే రోగులకు చికిత్సను అందించడంలో జితేంద్ర ఎంతో శ్రద్ధను చూపించేవారని, ఆయన వద్దకు వచ్చి వెళ్లే వారంతా తదుపరి ఎంతో గౌరవాన్ని చూపించేవారని వర్శిటీ వ్యాఖ్యానించింది.

కాగా, జితేంద్రకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. యూకేలో సుమారు 15 లక్షల మంది భారత సంతతి ఉండగా, వైద్య విభాగంలో ఎంతో మంది సేవలందిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా యూకేలో మరణించిన వారి సంఖ్య సోమవారానికి 5,373కు చేరింది.
Jitendra Kumar Rathod
Died
Corona Virus
Doctor
UK

More Telugu News