Vijayashanti: ఎప్పుడూ కేసీఆర్ ను విమర్శించే విజయశాంతి.. తొలిసారి ఆయనకు మద్దతు పలికిన వైనం!

  • లాక్ డౌన్ కొనసాగించాలని ప్రధానికి సూచించిన కేసీఆర్
  • ప్రస్తుత పరిస్థితిని కొనసాగించడమే మంచిదన్న విజయశాంతి
  • కేసీఆర్ నిర్ణయానికి సంపూర్ణ మద్దతు 
I support KCRs decision on lockdown says Vijayashanthi

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో కూడా కేసుల సంఖ్య 360 దాటింది. ఈ నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ ను కొనసాగించడమే మంచిదని చెప్పారు. ఇదే విషయాన్ని ప్రధాని మోదీకి విన్నవిస్తున్నానని... ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలని చెప్పారు. కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి స్పందిస్తూ... ముఖ్యమంత్రి నిర్ణయం సరైనదని కితాబిచ్చారు.

కరోనాను పూర్తిగా అరికట్టాలంటే లాక్ డౌన్ ను మరిన్ని రోజులపాటు కొనసాగించాల్సిందేనని విజయశాంతి చెప్పారు. మధ్యలో లాక్ డౌన్ ను ఎత్తివేస్తే పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదం లేకపోలేదని అన్నారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా లాక్ డౌన్ ను కొనసాగించాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని తాను సంపూర్ణంగా సమర్థిస్తున్నానని చెప్పారు.

మరోవైపు నిన్న కేసీఆర్ మాట్లాడుతూ, లాక్ డౌన్ ను ఒక్కసారి ఎత్తివేస్తే మళ్లీ అమలు చేయడం చాలా కష్టమవుతుందని అన్నారు. జనాలు రోడ్లపైకి వస్తే పరిస్థితి చేజారే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అమెరికా పరిశోధన సంస్థ బీసీజీ ఇండియాలో లాక్ డౌన్ ను జూన్ 3 వరకు కొనసాగించాలని సూచించిందని చెప్పారు. లాక్ డౌన్ వల్ల ఆదాయం కోల్పోయినా పర్వాలేదని అన్నారు. కోల్పోయిన ఆదాయాన్ని మళ్లీ సంపాదించుకోవచ్చని... పోయిన ప్రాణాలను మళ్లీ తెచ్చుకోలేమని కేసీఆర్ చెప్పారు.

More Telugu News