ఇటలీ, స్పెయిన్ లలో తగ్గిన కేసులు, మరణాలు... భారీ లాభాల్లో ప్రపంచ స్టాక్ మార్కెట్!

07-04-2020 Tue 08:13
  • 7 శాతానికి పైగా పెరిగిన నాస్ డాక్
  • పరుగులు పెట్టిన ఆసియా మార్కెట్లు
  • 2 శాతం లాభంలో ఎస్జీఎక్స్ నిఫ్టీ
World Market Profits Jump

కరోనా వైరస్ వ్యాప్తికి హాట్ స్పాట్ దేశాలుగా గుర్తింపు పొందిన ఇటలీ, స్పెయిన్ లలో కొత్త కేసుల సంఖ్య తగ్గడం, రోజువారీ సగటు మరణాలు కూడా తగ్గడం, ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను పెంచడంతో నేటి వరల్డ్ మార్కెట్ దూసుకెళ్లింది. సోమవారం నాడు మహావీర్ జయంతి సందర్భంగా భారత మార్కెట్లకు సెలవు కాగా, యూఎస్ ఎక్స్ఛేంజ్ సూచిక ఏకంగా 7 శాతానికి పైగా పెరిగింది. నాస్ డాక్ 7.33 శాతం లాభంతో 7,913 పాయింట్లకు చేరింది.

దీని ప్రభావంతో మంగళవారం నాటి ఆసియా మార్కెట్ పరుగులు పెట్టింది. నిక్కీ 2.02 శాతం, స్ట్రెయిట్స్ టైమ్స్ 2.19 శాతం, హాంగ్ సెంగ్ 0.71 శాతం, తైవాన్ వెయిటెన్డ్ 1.54 శాతం, కోస్పీ 0.82 శాతం, సెట్ కాంపోజిట్ 0.5 శాతం, జకార్తా కాంపోజిట్ 3.22 శాతం, షాంగై కాంపోజిట్ 1.61 శాతం లాభపడ్డాయి.

ప్రస్తుతం ఎస్జీఎక్స్ నిఫ్టీ 1.93 శాతం లాభాలను చూపిస్తోంది. ఈ ఉదయం మార్కెట్ ప్రారంభమైన తరువాత భారీ లాభాల దిశగా సెన్సెక్స్, నిఫ్టీ దూసుకెళ్లవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక సోమవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా 12 లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య 70 వేలకు పైగా నమోదైంది. ఇదే సమయంలో యూఎస్ లో కేసుల సంఖ్య నిలకడ స్థాయికి చేరుకుందని అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను పెంచింది.