Andhra Pradesh: కరోనాపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఆరోగ్యశ్రీ జాబితాలో చేరుస్తూ ఉత్తర్వులు

important decision taken by AP government on Corona
  • ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అందించాలంటూ ఉత్తర్వులు
  • మార్గదర్శకాలు జారీ
  • రూ. 16 వేల నుంచి రూ. 2.16 లక్షల వరకు చెల్లింపు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా రోగులను ఆదుకునే ప్రయత్నం చేసింది. కరోనా చికిత్సను ‘ఆరోగ్య శ్రీ’ పథకంలో చేర్చింది. కోవిడ్-19 కేసులను ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ చేర్చుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. రోగులను ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో చేర్చుకోవాలని, వారికి చికిత్స అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకు సంబంధించి 15 రకాల ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీ ప్యాకేజీలో చేర్చింది. అలాగే, ధరల ప్యాకేజీని కూడా నిర్ణయించింది. కరోనా కేసులకు కనిష్ఠంగా రూ. 16 వేల నుంచి గరిష్ఠంగా రూ. 2.16 లక్షల ఫీజును నిర్ణయించింది.

రాష్ట్రంలో కొన్ని రోజుల వరకు స్థిరంగా ఉన్న కేసుల సంఖ్య తబ్లిగీ జమాత్ సదస్సు తర్వాత ఒక్కసారిగా పెరిగింది. ఢిల్లీలో జరిగిన ఈ సదస్సుకు రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల నుంచి ముస్లింలు హాజరయ్యారు. తిరిగి వచ్చిన వారు ఆ వివరాలను దాచిపెట్టడంతో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. నిన్నటి వరకు రాష్ట్రంలో 303 కేసులు నమోదు కాగా, ముగ్గురు మరణించారు. 295 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఐదుగురు కోలుకున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలులో 74 కేసులు నమోదు కాగా, నెల్లూరులో 42, గుంటూరులో 32 నమోదయ్యాయి. అనంతపురంలో అతి తక్కువగా ఆరు కేసులు నమోదయ్యాయి.
Andhra Pradesh
Corona Virus
aarogyasri

More Telugu News