కరోనా దెబ్బకు భారీగా పతనమైన ముఖేశ్ అంబానీ సంపద

06-04-2020 Mon 22:07
  • రెండు నెలల వ్యవధిలో 28 శాతం తగ్గుదల
  • రోజుకు 300 మిలియన్ డాలర్లు నష్టపోయిన అంబానీ
  • ప్రపంచ ర్యాంకుల్లో 17వ స్థానానికి చేరిక
Corona pandemic causes huge loss in Mukesh Ambani networth

కరోనా మహమ్మారి మనుషుల ప్రాణాలనే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను సైతం దారుణంగా దెబ్బతీస్తోంది. భారత్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యాపార సామ్రాజ్యం కూడా కరోనా ధాటికి ఒడిదుడుకులకు లోనవుతోంది. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సంపద కూడా బాగా పతనమైంది. గత రెండు నెలల వ్యవధిలో ముఖేశ్ నెట్ వర్త్ లో 28 శాతం తగ్గుదుల నమోదైంది. తద్వారా ఆయన నికర ఆస్తుల విలువ 48 బిలియన్ డాలర్లకు పడిపోయింది.

మార్చి 31వరకు అంచనాల ప్రకారం రోజుకు 300 మిలియన్ డాలర్ల చొప్పున నష్టపోయినట్టు ఓ నివేదికలో వెల్లడైంది. హరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం ప్రపంచ కుబేరుల జాబితాలో ముఖేశ్ అంబానీ 8 స్థానాలు పతనమై 17వ స్థానానికి చేరుకున్నారు.

ప్రపంచ స్థాయిలో అంబానీ కంటే ఎక్కువగా నష్టపోయింది ఫ్రెంచ్ ఫ్యాషన్ రంగ దిగ్గజం ఎల్వీఎంహెచ్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ అని చెప్పాలి. ఆర్నాల్ట్ సంపదలో 28 శాతం తగ్గుదల నమోదైంది. ప్రస్తుతం ఆర్నాల్ట్ సంపద విలువ 77 బిలియన్ డాలర్లు. ఇక, ఆదానీ గ్రూప్ కు చెందిన గౌతమ్ అదానీ (37 శాతం), హెచ్ సీఎల్ టెక్నాలజీస్ అధినేత శివ్ నాడార్ (26 శాతం) సైతం భారీగా నష్టపోయారు.