భారత్ లో దశల వారీగా లాక్ డౌన్ ఎత్తివేత..?

06-04-2020 Mon 20:26
  • కేంద్రమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్
  • లాక్ డౌన్ సడలింపుపై కార్యాచరణ రూపొందించాలన్న మోదీ
  • కరోనా తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ కొనసాగించే అవకాశం
PM Modi thinks about lock down

కరోనా ప్రభావంతో దేశంలో విధించిన లాక్ డౌన్ ఏప్రిల్ 14తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. వీడియో లింక్ ద్వారా కేంద్ర మంత్రులతో మాట్లాడిన ఆయన, లాక్ డౌన్ పై చర్చించారు. దశల వారీగా లాక్ డౌన్ ను ఎత్తివేసే క్రమంలో ఎలాంటి చర్యలు ఉండాలన్న దానిపై మంత్రుల అభిప్రాయాలు తెలుసుకున్నారు.

లాక్ డౌన్ సడలించాల్సి వస్తే అనుసరించాల్సిన విధివిధానాలపై ఓ కార్యాచరణ రూపొందించాలని సూచించారు. కరోనా తీవ్రంగా ఉన్న ప్రాంతాలను మినహాయించి మిగతా అన్ని ప్రాంతాలకు వర్తించేలా ఆ కార్యాచరణ ఉండాలని మోదీ దిశానిర్దేశం చేశారు. ప్రధాని వ్యాఖ్యలను బట్టి దేశంలో కరోనా కేసులు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ యథావిధిగా కొనసాగుతుందని, మిగతా ప్రాంతాల్లో తీవ్రతను అనుసరించి ఆంక్షల సడలింపు ఉంటుందని తెలుస్తోంది.