కొవిడ్-19పై సమాచారం కోసం వాట్సాప్ చాట్ బోట్ ను ఆవిష్కరించిన తెలంగాణ ప్రభుత్వం

06-04-2020 Mon 18:02
  • ప్రజలను చైతన్యపరిచేందుకు టెక్నాలజీని వినియోగిస్తున్న సర్కారు
  • వాట్సాప్ భాగస్వామ్యంతో చాట్ బోట్ కు రూపకల్పన
  • ఇది కచ్చితమైన సమాచారం అందిస్తుందన్న మంత్రి కేటీఆర్
Telangana government launches WhatsApp Chatbot on corona virus

కరోనా వైరస్ భూతంపై పోరాటంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినిగియోగించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. కరోనా మహమ్మారిపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు, వారికి పూర్తి అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా వాట్సాప్ చాట్ బోట్ ను ఆవిష్కరించారు. 9000 658 658 నంబరుపై వాట్సాప్ లో చాట్ బోట్ తో ఎవరైనా సంభాషించవచ్చు. కరోనాపై ప్రజలు అడిగే అన్ని సందేహాలకు ఈ చాట్ బోట్ సమాధానమిస్తుంది.

ఈ చాట్ బోట్ ను ప్రారంభించిన సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, వాట్సాప్ తో కలిసి తాము ఈ కరోనా హెల్ప్ లైన్ ను అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించారు. ఈ చాట్ బోట్ అత్యంత కచ్చితమైన సమాచారం అందిస్తుందని వెల్లడించారు. అన్ని సమయాల్లో ప్రజలు సురక్షితంగా ఉండాలన్నదే తమ ఆలోచన అని స్పష్టం చేశారు. ఈ చాట్ బోట్ రూపకల్పనలో ఎస్బీ టెక్నాలజీస్, మెసెంజర్ పీపుల్ అనే సంస్థలు కూడా పాలుపంచుకున్నాయి.

ఈ చాట్ బోట్ వినియోగంపై ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ వివరాలు తెలిపారు. 9000 658 658 అనే నంబరుకు వాట్సాప్ లో "హాయ్" అని కానీ, "హలో" అని కానీ లేక "కొవిడ్" అని కానీ పంపిస్తే, కరోనాపై సమాచారం ఇస్తుందని అన్నారు.