కరోనాపై పోరులో ఆశాదీపంలా కనిపిస్తున్న మరో ఔషధం!

06-04-2020 Mon 16:12
  • ఇవెర్ మెక్టిన్ పనితీరుపై పరిశోధనలు
  • 48 గంటల్లో కరోనాను నిర్మూలించిన వైనం
  • మరికొన్ని పరిశోధనలు జరగాల్సి ఉందంటున్న పరిశోధకులు
Researchers tells Ivermectin can fight against corona

మానవ దేహంలోని పరాన్నజీవులను తరిమికొట్టే దివ్యౌషధంగా ఇవెర్ మెక్టిన్ కు పేరుంది. అయితే ఇప్పుడీ యాంటీ పారసైటిక్ ఔషధం కరోనా చికిత్సలో బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. ప్రయోగశాలలో సృష్టించిన కరోనా వైరస్ కణజాలంపై ఇవెర్ మెక్టిన్ ప్రభావవంతంగా పనిచేసిందని, వైరస్ అభివృద్ధిని సమర్థంగా నిరోధించిందని ఓ అధ్యయనం వెల్లడించింది. కేవలం 48 గంటల్లో కరోనా వైరస్ ను రూపుమాపిందని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న కైలీ వాగ్ స్టాఫ్ తెలిపారు.

ఇవెర్ మెక్టిన్ ప్రమాదకర హెచ్ఐవీ, డెంగ్యూ, జికా, ఇన్ ఫ్లుయెంజా తదితర వైరస్ లపై ప్రభావశీలంగా పనిచేస్తుందని గతంలోనే గుర్తించారు. తాజాగా కరోనాను కూడా ఇది దీటుగా తిప్పికొడుతుందని అధ్యయనంలో పేర్కొన్నారు. ఇవెర్ మెక్టిన్ ఎంతో సురక్షితమైన ఔషధం అని, మనుషుల్లో కూడా సరైన మోతాదులో ఉపయోగిస్తే మంచి ఫలితాలు వస్తాయని వాగ్ స్టాఫ్ తెలిపారు.

అయితే, కరోనాను ఇవెర్ మెక్టిన్ ఎలా రూపుమాపుతుందన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదని ఆమె వెల్లడించారు. కొన్నిరకాల వైరస్ లు ఆతిథ్య కణాలను మందగింపచేస్తాయని, ఆ సామర్ధ్యంపైనే ఇవెర్ మెక్టిన్ బలంగా దెబ్బతీస్తుందని, కరోనా వైరస్ విషయంలోనూ ఇవెర్ మెక్టిన్ అలాంటి పనితీరునే ప్రదర్శిస్తుందని భావిస్తున్నామని వివరించారు. అయితే ఈ విషయంలో మరికొన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.