రూ. 26 లక్షల విరాళం ప్రకటించిన పుల్లెల గోపీచంద్

06-04-2020 Mon 15:49
  • కరోనా వైరస్‌పై  పోరాటానికి తన వంతు సాయం
  • పీఎం కేర్స్‌ ఫండ్‌కు  11 లక్షలు
  • తెలంగాణ  సీఎం సహాయ నిధికి పది, ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌ కు ఐదు లక్షలు
Pullela Gopichand donates Rs 26 lakh to coronavirus relief fund

కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటంలో భాగం కావడానికి అనేక మంది ముందుకొస్తున్నారు. వ్యాపారవేత్తలు, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తమకు తోచిన సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో తన వంతు సాయంగా రూ. 26 లక్షలు విరాళంగా ఇస్తున్నట్టు  భారత బ్యాడ్మింటన్ ప్రధాన కోచ్ పుల్లెల గోపీచంద్ తెలిపారు.

కరోనాపై పోరాటంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు చిన్న సాయం చేస్తున్నట్టు ప్రకటించారు. పీఎం-కేర్స్ పండ్‌కు రూ. 11 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 10 లక్షలు, ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 5 లక్షలు ట్రాన్స్ ఫర్ చేశారు.

‘మన దేశం భిన్నమైనది. అనేక సవాళ్ల మధ్య కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా బాగా పని చేస్తున్నాయి. మనం కూడా వాటికి సాయం చేద్దాం. ముఖ్యంగా నిబంధనలు పాటించి, ఇంట్లోనే ఉందాం’ అని గోపీచంద్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ మహమ్మారి కారణంగా మన దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ తమకు తోచిన సాయం చేసేందుకు ముందుకురావాలని సూచించారు. ఈ పోరాటంలో మనం కచ్చితంగా విజయం సాధిస్తామన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.