Kamal Haasan: పీఎం సర్... మీరు మళ్లీ తప్పు చేశారు: మోదీకి లేఖ రాసిన కమలహాసన్

Kamal Haasan wrote open letter to PM Modi
  • లాక్ డౌన్ నిర్ణయాన్ని ప్రశ్నించిన కమల్ 
  • ఉన్నత వర్గాలనే కాదు, పేదలను కూడా పట్టించుకోవాలని హితవు
  • కరోనాపై ముందే ఎందుకు స్పందించలేదంటూ ఆగ్రహం
గతంలో తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం ఎంత పెద్ద తప్పో తర్వాత కాలంలో తేలిందని, ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు మరో తప్పు చేస్తున్నారని మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమలహాసన్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ప్రధానికి బహిరంగ లేఖ రాశారు. నోట్ల రద్దు నిర్ణయం తరహాలోనే అకస్మాత్తుగా లాక్ డౌన్ ప్రకటించారని ఆరోపించారు. నాడు నోట్ల రద్దుతో  పేద ప్రజల పొట్టకొట్టారని, నేడు లాక్ డౌన్ కారణంగా జీవనోపాధితో పాటు జీవితాలే గల్లంతవుతున్నాయని తెలిపారు.

"మీరు దీపాలు వెలిగించమంటే మీ వాళ్లు బాల్కనీల్లో ఎంచక్కా మంచినూనెతో దీపాలు వెలిగించారు, కానీ పేదలు మాత్రం రొట్టెలు చేసుకునేందుకు నూనె దొరక్క అవస్థలు పడుతున్నారు. మీ ప్రసంగాలు కూడా బాగానే ఉన్నాయి. బాల్కనీలు 'ఉన్న'వాళ్ల భయాలు తొలగించేందుకు మీ ప్రసంగాలు ఉపయోగపడుతున్నాయి, కానీ, నెత్తిన పైకప్పు తప్ప మరేమీ లేని బడుగుల మాటేమిటి? జీడీపీకి ప్రధాన వనరు అనదగ్గ పేదవాళ్లను విస్మరించడం తగదు. అలాంటివారిని అణగదొక్కాలని జరిగిన ప్రయత్నాలకు చరిత్రలో ఎలాంటి జవాబులు వచ్చాయో మీరు తెలుసుకోవాలి.

చైనాలో తొలి కరోనా కేసు వచ్చినప్పటి నుంచి మీరు ఎందుకు స్పందించలేదు? మీ దార్శనికత ఏమైంది? హడావుడిగా లాక్ డౌన్ నిర్ణయం ప్రకటించారు. దార్శనికత ఉన్న నాయకులైతే సమస్య తీవ్రతరం కాకముందే స్పందిస్తారు. ఈ విషయంలో మీరు విఫలం అయ్యారనే భావిస్తున్నాం. మీరు అందరినీ కలుపుకుని ముందుకుపోవాలనుకుంటే మేము సైతం మీకు తోడుగా ఉంటాం, మాకు ఎంతో ఆగ్రహం కలుగుతున్నా గానీ మేం ఇప్పటికీ మీవెంటే ఉన్నాం" అంటూ లేఖను ముగించారు.
Kamal Haasan
Narendra Modi
Lockdown
Corona Virus
Demonitazation
MNM

More Telugu News