ఆత్మకథ రాసే దిశగా చిరంజీవి ఆలోచన!

06-04-2020 Mon 15:21
  • గట్టిపోటీని ఎదుర్కున్న చిరూ 
  • స్వయంకృషితో ఎదిగిన తీరు 
  • పుస్తకరూపంలో అనుభవాలు - జ్ఞాపకాలు
Chiranjeevi

ఎన్టీఆర్ .. అక్కినేని .. కృష్ణ .. శోభన్ బాబు తెలుగు తెరను ఏలుతున్న సమయంలో ఎంట్రీ ఇచ్చి, తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న కథానాయకుడిగా చిరంజీవి కనిపిస్తారు. చిన్న చిన్న పాత్రలతో మొదలైన ప్రయాణం, ఆయనను మెగాస్టార్ అనే సింహాసనంపై కూర్చోబెట్టింది. ఈ మధ్యలోను ఎత్తుపల్లాలను ఎదుర్కుంటూ వచ్చారాయన.

ఇప్పటికే చిరంజీవి ఎదిగిన వైనంపై పలు పుస్తకాలు ఇంతకుముందు వచ్చాయి. అయితే ఆత్మకథ రాయాలని ఉందనే విషయాన్ని గురించి ఆయన కొన్ని సందర్భాల్లో ప్రస్తావించారు. అయితే ఆయనకి అంత తీరిక లేకపోవడం వలన, ఆ ఆలోచన వాయిదాపడుతూ వచ్చింది.

కరోనా లాక్ డౌన్ కారణంగా ఇంటిపట్టునే విశ్రాంతి తీసుకుంటున్న ఆయన, తన ఆత్మకథను గురించి ఆలోచనను ఆచరణలో పెట్టినట్టుగా సమాచారం. తన కెరియర్ మొదలవడానికి ముందు విషయాలు .. కెరియర్ తొలినాళ్లలో ఎదురైన అనుభవాలు .. జ్ఞాపకాలను ఆయన రికార్డు చేస్తున్నారట. త్వరలోనే ఈ సమాచారాన్ని ఆయన మంచి రచయితకు ఇచ్చి, తన ఆత్మకథను పుస్తకరూపంలో వెలువరించనున్నట్టు తెలుస్తోంది.