వారానికి 3 నుంచి 6 కోడిగుడ్లతో మీ గుండె భద్రం!

06-04-2020 Mon 15:13
  • రోజుకో గుడ్డుతో హృదయ సంబంధ వ్యాధులు దూరం
  • చైనాలో జరిగిన ఓ అధ్యయనంలో వెల్లడి
  • అతిగా తీసుకుంటే ఇతర సమస్యలు వస్తాయని గుర్తింపు
Just 3 to 6 eggs per week are enough to keep your heart health in check

మనం తీసుకునే ఆహారంలో అత్యంత పోషక విలువలున్న ఆహార పదార్థాల్లో కోడి గుడ్డు ఒకటి. అనేక పోషకాలతో పాటు శక్తిని ఇస్తుంది. అల్పాహారంలో గుడ్డును కూడా తీసుకుంటే ఆరోగ్యంతో పాటు బరువు కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఉడకబెట్టిన, గిలకొట్టిన, లేదా వేయించిన గుడ్లు రోజూ తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని చైనాలో జరిగిన ఓ తాజా  అధ్యయనంలో తేలింది.

వారానికి మూడు నుంచి ఆరు గుడ్లు తింటే గుండెకు సంబంధించిన వ్యాధులు (కార్డియో వాస్కులర్ డిసీజ్- సీవీడీ) వచ్చే ప్రమాదం తగ్గుతుందని  చైనీస్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్‌కు అనుబంధ ఫువాయ్ ఆసుపత్రికి చెందిన జియా, ఆమె సహచరులు తమ అధ్యయనంలో గుర్తించారు. తమ దేశంలో గుడ్లు తినేవాళ్లు, సీవీడీకి గురయ్యే వాళ్లు, సాధారణ మరణాలపై అధ్యయనం చేసి ఈ విషయాన్ని తేల్చారు. ఇందులో వారానికి 3 నుంచి 6 గుడ్లు తినే వారికి సీవీడీ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉందని వెల్లడించారు.

అదే సమయంలో గుడ్లను మితంగా తీసుకోవడం వల్ల అదనపు ప్రయోజనాలు కూడా ఉంటాయని తేల్చారు. వారానికి ఒకటి కంటే ఎక్కువ గుడ్లు తినే వారికి సీవీడీ వచ్చే ప్రమాదం 22 శాతం ఉంటే, దాని కారణంగా మరణం సంభవించే చాన్స్ 29 శాతం ఉందన్నారు. మరోవైపు వారానికి పదికంటే తక్కువ గుడ్లు తీసుకునే వారు 39 శాతం ఉంటే.. వారిలో సీవీడీ వచ్చి, దాని వల్ల చనిపోయే ప్రమాదం 13 శాతం ఉందని గుర్తించారు. ఇక, గుడ్లు అతిగా తీసుకుంటే ఇతర సమస్యలు వస్తాయని, ముఖ్యంగా డైటరీ కొలెస్ట్రాల్‌పై ప్రభావం పడుతుందని తేల్చారు. అందువల్ల రోజుకో గుడ్డు తీసుకోవడం ఉత్తమం అని తెలిపారు.