‘కరోనా’ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి పలు సూచనలు చేసిన చంద్రబాబు

06-04-2020 Mon 15:13
  • పేదలకు తొలి విడతగా కనీసం రూ.5 వేలు ఇవ్వాలి
  • రాష్ట్రంలో మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేయాలి
  • ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించడం సరికాదు
Chandrababu Naidu suggestions to AP Government

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు.

రాష్ట్రంలో పేదలను ఆదుకునే విషయంలో ప్రభుత్వం దృష్టి సారించాలని, పేదలకు తొలి విడతగా కనీసం రూ.5 వేలు ఇవ్వాలని సూచించారు. తెల్ల రేషన్ కార్డుదారులందరికీ డబ్బులు ఇవ్వాలని, కేంద్రం ఇస్తున్న నగదుతో పాటు రాష్ట్రం కూడా ఇవ్వాలని కోరారు. వెంటిలేటర్ల తయారీ నిమిత్తం ముందుకొస్తున్న సంస్థలను ప్రభుత్వం ప్రోత్సహించాలని, రాష్ట్రంలో మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేయాలని, ఆక్వా, హార్టికల్చర్, పౌల్ట్రీ రైతులను ఆదుకోవాలని, ఆక్వా ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సూచించారు.

ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించడం సరికాదని విమర్శించిన చంద్రబాబు, అవసరమైతే, ఉద్యోగుల చేత వారి ఇళ్ల నుంచే పనిచేయించాలని సూచించారు. ‘కరోనా’ కట్టడికి ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని, ప్రజలందరూ తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని సూచించారు. ‘కరోనా’పై వస్తున్న వదంతులను నమ్మొద్దని  కోరారు. ఈ వైరస్ ను అంతమొందించే మందును కనుగొనే వరకూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు.