క్రీడా రంగంలో ఈ మూడు అలవాట్లపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం!

06-04-2020 Mon 14:39
  • ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి
  • స్తంభించిన క్రీడారంగం
  • వైరస్ వ్యాప్తికి దారితీసేలా ఉన్న క్రీడా సంప్రదాయాలు, అలవాట్లు 
  • ఇకపై క్రీడాకారుల అలవాట్లలో మార్పు వచ్చే అవకాశం
Corona changes sports habits a lot

క్రికెట్ లో బంతికి ఉమ్మి పూసి రుద్దడం, చెమటతో బంతిని పాలిష్ చేయడం ఎప్పటినుంచో ఉంది. టెన్నిస్ లో ఆటగాళ్లకు బాల్ బాయ్స్, బాల్ గాళ్స్ టవల్స్ అందించడం, ఆ టవల్ తో ఆటగాళ్లు తమ స్వేదాన్ని తుడుచుకుని తిరిగి ఇచ్చేయడం సాధారణమైన విషయం. అలాగే, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్ క్రీడల్లో మ్యాచ్ కు ముందు, తర్వాత కరచాలనం చేసుకోవడం పరిపాటి.

అయితే, ఇప్పుడు మహారక్కసిలా విజృంభిస్తోన్న కరోనా ధాటికి ఈ మూడు అంశాలపై పెను ప్రభావం పడనుంది. ఇకపై తాము ఎప్పట్లా బంతికి ఉమ్మిపూసి పాలిష్ చేయలేమని, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అదెంత ప్రమాదకరమో అర్థమవుతోందని ఆసీస్ ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ అభిప్రాయపడ్డాడు.

గ్రీస్ కు చెందిన ప్రముఖ టెన్నిస్ ఆటగాడు స్టెఫానోస్ సిట్సిపాస్ మాట్లాడుతూ, మ్యాచ్ సాగుతున్నప్పుడు టవల్ అందుకుని తుడుచుకోవడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, కానీ ఇప్పుడలా చేయడంపై ఓసారి పునరాలోచించుకోవాల్సి ఉంటుందని అన్నాడు. అంతేకాదు, ఆటగాళ్ల చెమటతో కూడిన ఈ టవళ్లను పట్టుకుని ఉండే బాల్ బాయ్స్, బాల్ గాళ్స్ పరిస్థితిపై టెన్నిస్ వర్గాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

అమెరికాలో కాసులవర్షం కురిపించే క్రీడగా పేరుపొందిన బాస్కెట్ బాల్ లీగ్ ఎన్బీయేలోనూ ఇదే తరహా అభిప్రాయాలు వినిపించాయి. ఇకపై తాము హై-ఫైవ్ (పాయింట్లు వచ్చినప్పుడు సంతోషంతో చేతులు తాకించుకోవడం) చేసుకోవడానికి సాహసించలేమని ఎన్బీయే సూపర్ స్టార్ లెబ్రాన్ జేమ్స్ పేర్కొన్నాడు. అటు ఎన్బీయే నిర్వాహకులు కూడా హై-ఫైవ్ కంటే పిడికిళ్లను తాకించుకోవడం కాస్తలో కాస్త మేలని సూచించారు.

అమెరికా మహిళా ఫుట్ బాల్ తార మేగాన్ రపినోయ్ దీనిపై స్పందిస్తూ, మ్యాచ్ సందర్భంగా కరచాలనం చేయడం, హై-ఫైవ్ చేయడంపై నిషేధం విధించాలని అంటోంది. మ్యాచ్ మొత్తం తాము చెమటలు చిందిస్తూనే ఉంటామని, అలాంటి పరిస్థితుల్లో కరచాలనం, హై-ఫైవ్ ఎంత ప్రమాదకరమో అర్థమవుతోందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ కు ముందే అంతర్జాతీయ ఫుట్ బాల్ లీగ్ పోటీల్లో మ్యాచ్ కు ముందు, తర్వాత కరచాలనాలు, ఆటోగ్రాఫులు, సెల్ఫీలపై నిషేధం విధించారు. అప్పటికే ఇటలీ, స్పెయిన్ దేశాల్లో కరోనా కలకలం మొదలవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

అటు మికీలో జపాన్, ఈక్వెడార్ జట్ల మధ్య జరిగిన డేవిస్ కప్ టెన్నిస్ పోటీలను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించడంతోపాటు బాల్ బాయ్స్, బాల్ గాళ్స్ కు చేతులకు గ్లోవ్స్ అందజేశారు. ఏదేమైనా కరోనా ఉద్ధృతి తగ్గిన తర్వాత ప్రపంచ క్రీడారంగంలో అనేక సంప్రదాయాలు, అలవాట్లలో భారీగా మార్పులు చోటుచేసుకోనుండడం తథ్యంగా కనిపిస్తోంది.