'గాంధీ' ఐసోలేషన్‌ నుంచి ఎవరూ పరార్ కాలేదు: చిలకలగూడ సీఐ

06-04-2020 Mon 14:35
  • బాధితుడు గాంధీ ఐసోలేషన్‌లోని మరో వార్డులోకి వెళ్లాడు
  • బాత్‌రూమ్‌కి వెళ్లే సమయంలో కనిపించలేదంతే  
  • దీంతో తప్పుడు ప్రచారం జరిగింది
  • ఆసుపత్రిలో పకడ్బందీగా బందోబస్తు
coronavirus patients escape case

సికింద్రాబాద్‌లోని గాంధీ ఐసోలేషన్‌ వార్డు నుంచి కరోనా బాధితుడు పరారయినట్లు జరిగిన ప్రచారంపై చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి వివరణ ఇచ్చారు. గాంధీ ఐసోలేషన్‌ నుంచి ఎవరూ పరార్ కాలేదని స్పష్టం చేశారు. చిన్న గందరగోళం వల్ల ఇలాంటి ప్రచారం జరిగిందన్నారు. బాధితుడు గాంధీ ఐసోలేషన్‌లోని మరో వార్డులోకి వెళ్లాడని, బాత్‌రూమ్‌ కోసమని అక్కడికి వెళ్లి కాసేపు కనిపించకపోవడంతో తప్పుడు ప్రచారం జరిగిందని తెలిపారు.

బాధితుడు తమ వార్డులో కనిపించట్లేదని తోటి రోగులు వైద్య సిబ్బందికి తెలిపారని, బాధితుడిని వేరే వార్డులో గుర్తించి తిరిగి ఐసోలేషన్‌ వార్డుకి పంపామని పోలీసులు తెలిపారు. ఆసుపత్రిలో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేశామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.