మళ్లీ సంక్రాంతి పండగనే టార్గెట్ చేసిన అనిల్ రావిపూడి

06-04-2020 Mon 13:50
  • వరుసగా పలకరిస్తున్న విజయాలు 
  • 'ఎఫ్ 2' సీక్వెల్ కి సన్నాహాలు 
  • సంక్రాంతి సెంటిమెంట్ తో అనిల్ రావిపూడి 
Anil Ravipudi Movie

తెలుగులో ఇంతవరకూ పరాజయం ఎరుగని దర్శకుల జాబితాలో అనిల్ రావిపూడి కూడా ఒకరుగా కనిపిస్తాడు. యూత్ .. మాస్ .. ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని కథలను సిద్ధం చేసుకోవడంలోను, కామెడీకి ప్రాధాన్యతనిస్తూ నాన్ స్టాప్ గా నవ్వించడంలోను ఆయన సిద్ధహస్తుడు. ఆయన తెరకెక్కించిన 'ఎఫ్ 2' క్రితం ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని సాధించింది. ఆ తరువాత చేసిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేసింది.

ఈ నేపథ్యంలో ఆయన తన తదుపరి సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దింపాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.  'ఎఫ్ 2'కి సీక్వెల్ గా ఆయన 'ఎఫ్ 3' సినిమా చేస్తున్నాడు. లాక్ డౌన్ ఎత్తేయగానే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. వచ్చే సంక్రాంతిని దృష్టిలో పెట్టుకునే అనిల్ రావిపూడి రంగంలోకి దిగుతున్నాడని అంటున్నారు.