కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న కనికా కపూర్

06-04-2020 Mon 12:33
  • ఆరో టెస్టులో నెగిటివ్ రిపోర్టు
  • ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన బాలీవుడ్ సింగర్
  • ఆమెపై ఇప్పటికే మూడు ఎఫ్ఐఆర్ లు నమోదు
Kanika Kapoor discharged from Lucknow hospital

బాలీవుడ్ ప్రముఖ సింగర్ కనికా కపూర్ కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకుంది. ఆమెకు ఆరోసారి నిర్వహించిన టెస్టులో కరోనా నెగిటివ్ అని తేలింది. దాంతో, లక్నో లోని సంజయ్ గాంధీ ఆసుపత్రి నుంచి ఆమెను సోమవారం డిశ్చార్జ్ చేశారు. శనివారం నిర్వహించిన ఐదో టెస్టులోనే నెగిటివ్ వచ్చినప్పటికీ  ముందు జాగ్రత్తగా మరోసారి టెస్టు చేశారు. ఆమె పూర్తిగా కోలుకుందని నిర్ధారించిన తర్వాత బయటకు పంపించారు.

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పటికీ కనిక మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమెపై మూడు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండాలన్న అధికారుల ఆదేశాలను ఉల్లఘించడం, వైరస్‌ సోకినప్పటికీ నిర్లక్ష్య పూరితంగా పలు సోషల్ ఈవెంట్లకు హాజరవడంతో ఆమెపై వివిధ సెక్షన్ల కింద కేసులు బుక్‌ చేశారు.  

దేశంలో కరోనా సోకిన బాలీవుడ్ తొలి సెలబ్రిటీ కనికా కపూర్ కావడం గమనార్హం. లండన్ నుంచి వచ్చిన తర్వాత తనలో ఫ్లూ లక్షణాలు ఉన్నట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపిన కనిక తర్వాత ఆ పోస్ట్‌ ను డిలీట్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే పరీక్షలు నిర్వహించి పాజిటివ్ ఫలితం వచ్చే వరకు తనకు వైరస్ సోకిందన్న విషయం తెలియదని ఆమె చెప్పింది.