కరోనా పాజిటివ్ బాధితుల ఇంటికి వెళ్లిన హరీశ్ రావు

06-04-2020 Mon 11:56
  • మయూరీనగర్ లో కరోనా బాధితుల ఇంటికి హరీశ్
  • కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పిన మంత్రి
  • ఆ ప్రాంతమంతా స్ప్రే చేయించిన హరీశ్
Harish Rao visits corona virus patients home

తెలంగాణలో కరోనా రక్కసి అంతకంతకూ విస్తరిస్తోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు మంత్రి హరీశ్ రావు అనునిత్యం ప్రజల్లో తిరుగుతూ వారిలో చైతన్యాన్ని నింపేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. తన నియోజకవర్గంలో కలియతిరుగుతూ ప్రజలకు తగు సూచనలు చేస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని మయూరీనగర్ లో కరోనా పాజిటివ్ బాధితుల ఇంటికి ఆయన వెళ్లారు. కుటుంబసభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నారు.

సదరు కుటుంబంలోని బాధిత తండ్రీకొడుకులు ఇద్దరూ హైదరాబాదులోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఈ సందర్భంగా హరీశ్ రావు తెలిపారు. ఈ సాయంత్రం వీరిద్దరినీ గాంధీ ఆసుపత్రిలోని ఐసొలేషన్ కు తరలిస్తామని చెప్పారు. అంతేకాదు... మయూరీనగర్ అంతటా ఆయన పర్యటించి... దగ్గరుండి సోడియం హైపోక్లోరైడ్ ను ఆ ప్రాంతమంతా హరీశ్ స్ప్రే చేయించారు.