Narendra Modi: ప్రెస్ మీట్ లో చెప్పినట్టు.. ఒవైసీపై కేసీఆర్ చర్యలు తీసుకుంటారా?: విజయశాంతి

  • ప్రధానిని అవహేళన చేస్తూ ఒవైసీ ట్వీట్లు చేశారు
  • పీఎంను అవహేళన చేసేవారిపై చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు
  • ఒవైసీపై చర్యలపై కేసీఆర్ స్పష్టతను ఇవ్వాలి
Can KCR takes action against Owaisi asks Vijayashanthi

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీలపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు. కరోనా మహమ్మారిపై కులమతాలకు అతీతంగా ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మొదటి నుంచి తన స్పందనను తెలియజేస్తున్నానని ఆమె తెలిపారు. ప్రాణాలకు తెగించి కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందిపై కొందరు చేసిన దాడులను ఖండించానని, ఇంకా అందుబాటులోకి రాని జమాతే వ్యక్తులు తక్షణమే ప్రభుత్వానికి సహకరించాలని సూచించానని చెప్పారు.

ప్రధాని మోదీని ఉద్దేశించి ఒవైసీ అవహేళనగా ట్వీట్లు చేశారని... గతంలో ప్రెస్ మీట్ లో కేసీఆర్ మాట్లాడుతూ ప్రధాని పిలుపును సోషల్ మీడియాలో అవహేళన చేసే వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారని... మరి, ఒవైసీపై చర్యలు తీసుకునే విషయంలో సీఎం క్లారిటీ ఇవ్వాలని  విజయశాంతి డిమాండ్ చేశారు. ప్రధానిని అవహేళన చేసిన ఒవైసీపై చర్యలు ఉంటాయా? లేదా? చెప్పాలని నిలదీశారు. సామాన్యుడికి ఒక న్యాయం, ఒవైసీకి ఒక న్యాయం అనే చందంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుందా? అనే విషయంపై స్పష్టతనివ్వాలని అన్నారు. రాష్ట్ర ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారని  చెప్పారు.

దీపాన్ని ఆరాధించే మన దేశంలో అత్యధిక ప్రజల మనోభావాలకు సంబంధించిన దీప ప్రజ్వలన కార్యక్రమాన్ని కేసీఆర్ కూడా సమర్థించారని... ఈ కార్యక్రమంపై ఎంఐఎం కూడా పిలుపునిస్తుందని ప్రజలు భావించారని విజయశాంతి చెప్పారు. కానీ, ప్రధాని పిలుపును ఒవైసీ అవహేళన చేశారని అన్నారు.

More Telugu News