New Delhi: తబ్లిగీ జమాత్‌ భవనాన్ని పరిశీలించిన పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు

  • రెండు విభాగాలుగా ఉన్న భవనం ఐదంతస్తులు పరిశీలన 
  • పలు కీలక డాక్యుమెంట్ల స్వాధీనం 
  • మౌలానాల సమక్షంలోనే తనిఖీలు.. వీడియో షూట్
crime branch police visited tabligi jamath building

ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని తబ్లిగీ జమాత్‌ కార్యాలయాన్ని నిన్న ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు, ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) ప్రతినిధుల సంయుక్త బృందం పరిశీలించింది. మార్చిలో ఈ కేంద్రంలో జరిగిన సమావేశానికి దేశం నలుమూలల నుంచి పలువురు హాజరుకావడం, ఆ తర్వాత వీరిలో చాలామందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం తెలిసిందే. దీంతో సమావేశానికి హాజరైన వారిని ఎక్కడికక్కడ గుర్తించి సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. కేంద్రంలోని వారందరినీ ఖాళీ చేయించిన అనంతరం రెండు రోజులపాటు వైరస్ నివారణ చర్యలు చేపట్టారు.

అనంతరం ఈ భవనంలోకి ప్రవేశించడం సురక్షితమన్న సర్టిఫికెట్ వైద్యశాఖ ఇవ్వడంతో నిన్న రెండు విభాగాలకు చెందిన సైబర్ ఫోరెన్సిక్ యూనిట్, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ తోఫాటు ఫొటో డివిజన్ ప్రతినిధులు కేంద్రంలోని రెండు విభాగాల్లోని ఐదంతస్తులను పరిశీలించారు. దాదాపు ఆరు గంటలపాటు భవనంలోని ఆమూలాగ్రం పరిశీలించిన బృందం ప్రతినిధులు భవనం మొత్తాన్ని మ్యాప్ చేశారు. వీడియో షూట్ చేశారు. భవనంలో చాలా రహస్య అరలు ఉన్నట్లు గుర్తించారు.

ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ 'మాతోపాటు మేనేజ్మెంట్ కమిటీకి చెందిన మౌలానాలను కూడా తీసుకువెళ్లాం. వారి సమక్షంలోనే భవనంలోని కార్యాలయం నుంచి కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నాం. మార్చి నెలలో రికార్డయిన సీసీ టీవీ పుటేజీ ఇవ్వాలని భవనం మేనేజరుని అడిగాం. అవసరమనుకుంటే మరోసారి భవనాన్ని సందర్శిస్తాం' అని తెలిపారు.

'ఇది చాలా సీరియస్ కేసు అయినప్పటికీ సున్నితమైన అంశాలతో ముడిపడివుంది. అందువల్ల ఆచితూచి అడుగు వేస్తున్నాం. అయినప్పటికీ అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తు పూర్తయ్యాక న్యాయనిపుణుల సలహా కూడా తీసుకున్న తర్వాత ఏ విధంగా అడుగు ముందుకు వేయాలన్న దానిపై ఓ నిర్ణయానికి వస్తాం' అని ఆ పోలీసు అధికారి వివరించారు.

కాగా, బృందం సభ్యులు భవనం లోపలి భాగాన్ని తనిఖీ చేసేందుకు వెళ్లే ముందు, తిరిగి వచ్చేటప్పుడు ప్రవేశ ద్వారం వద్దే వారికి పూర్తిగా వైద్యపరమైన తనిఖీలు నిర్వహించారు.

More Telugu News