బాలీవుడ్ లో మరో కలకలం.. 'చెన్నై ఎక్స్ ప్రెస్' చిత్ర నిర్మాత కూతురికి కరోనా పాజిటివ్!

06-04-2020 Mon 10:03
  • నిర్మాత కరీమ్ మొరానీ కుమార్తె షాజా మొరానీకి కరోనా పాజిటివ్
  • లాక్ డౌన్ కు ముందు ఆస్ట్రేలియా నుంచి వచ్చిన షాజా
  • ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స
Shaza Morani tests positive for Corona virus

సింగర్ కనికా కపూర్ కు కరోనా పాజిటివ్ రావడంతో బాలీవుడ్ ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ముంబై సినీ పరిశ్రమ మరోసారి షాక్ కు గురైంది. కనికా కపూర్ స్నేహితురాలు, బాలీవుడ్ నిర్మాత కరీమ్ మొరానీ కుమార్తె షాజా మొరానీకి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ముంబైలోని నానావతి ఆసుపత్రిలో ఉన్న కోవిడ్ వార్డులో ఆమెను చేర్పించి, చికిత్స అందిస్తున్నారు.

ప్రస్తుతం షాజా పరిస్థితి బాగానే ఉందని, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగి వస్తుందని కుటుంబసభ్యులు తెలిపారు. షాజా మోరానీ కుటుంబసభ్యులకు కూడా వైద్యులు కరోనా పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది. లాక్ డౌన్ ప్రకటించడానికి ముందే ఆస్ట్రేలియా నుంచి షాజా ఇండియాకు తిరిగొచ్చింది. షారుఖ్ ఖాన్, దీపికా పడుకునే జంటగా వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'చెన్నై ఎక్స్ ప్రెస్'ను కరీమ్ మొరానీ నిర్మించారు.

కనికా కపూర్ తో షాజా