ప్రియుడి కోసం: భర్తను లారీతో ఢీకొట్టించి హత్య చేయించిన భార్య!

06-04-2020 Mon 09:33
  • చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఘటన
  • మందుల కోసం బయటకు పంపి లారీతో ఢీకొట్టించిన భార్య
  • పోలీసుల విచారణలో వెల్లడైన అసలు నిజం
wife murdered husband with the help of boyfriend

కరోనా వైరస్ పుణ్యమా అని నేరాలు తగ్గుతున్నాయని భావిస్తున్న వేళ చిత్తూరు జిల్లా మదనపల్లెలో శనివారం వెలుగుచూసిన ఘటన సంచలనం సృష్టించింది. ప్రియుడి కోసం ఓ వివాహిత కట్టుకున్న భర్తను లారీతో ఢీకొట్టించి హత్య చేయించింది.

 పోలీసుల కథనం ప్రకారం.. పెద్దమండ్యం మండలంలోని చెరువుముందరపల్లెకు చెందిన బాలసుబ్రహ్మణ్యం (35).. 11 ఏళ్ల క్రితం నీరుగట్టువారిపల్లెకు చెందిన రేణుకను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మదనపల్లెలోని కదిరి రోడ్డులో గిఫ్ట్ సెంటర్ నిర్వహిస్తున్న ఈ దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. అయితే, వ్యాపారంలో నష్టం రావడంతో రెండేళ్ల క్రితం తిరుపతి వెళ్లిన బాలసుబ్రహ్మణ్యం ట్రావెల్స్ వ్యాపారం ప్రారంభించాడు.

పిల్లలతో కలిసి మదనపల్లెలో ఉంటున్న రేణుకకు ఈ క్రమంలో ఓ పార్టీకి చెందిన సేవాదళ్ కార్యకర్త కె.నాగిరెడ్డితో ఏర్పడిన పరిచయం సన్నిహిత సంబంధానికి దారితీసింది. ఇటీవల తిరిగి మదనపల్లెకు వచ్చిన బాలసుబ్రహ్మణ్యం తన భార్య నాగిరెడ్డితో సన్నిహితంగా ఉండడాన్ని చూసి మందలించాడు. ఇదే విషయమై పలుమార్లు ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

దీంతో భర్తను వదిలించుకోవాలని భావించిన రేణుక ఇదే విషయాన్ని ప్రియుడు నాగిరెడ్డికి చెప్పి భర్త హత్యకు ప్లాన్ చేసింది. శనివారం రాత్రి బాలసుబ్రహ్మణ్యానికి జలుబు చేయడంతో, వెళ్లి మందులు తెచ్చుకోమంటూ రాత్రి 11 గంటల సమయంలో ఒత్తిడి చేసింది. అతడు బయటకు వెళ్లగానే విషయాన్ని ప్రియుడికి చేరవేసింది.

 సమయం కోసం వేచి చూస్తున్న నాగిరెడ్డి మందులు తీసుకుని వస్తుండగా లారీతో ఢీకొట్టి హత్య చేశాడు. బాలసుబ్రహ్మణ్యం సోదరుడు, న్యాయవాది అయిన కె.రఘుపతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేప్టటిన పోలీసులు అసలు విషయం రాబట్టారు. రేణుక, ఆమె ప్రియుడు నాగిరెడ్డి సహా మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు.