కరోనాను వ్యాపింపజేస్తున్నారని 'తబ్లిగీ జమాత్'ను విమర్శించినందుకు.. దారుణంగా కాల్చి చంపాడు!

06-04-2020 Mon 09:22
  • యూపీలో ఓ టీ బంక్ వద్ద జమాత్ ను విమర్శించిన వ్యక్తి
  • కాల్పుల్లో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన బాధితుడు
  • ఘటనా స్థలిలో భారీగా మోహరించిన పోలీసులు
UP man shot dead at tea shop for blaming Tablighi Jamaat for coronavirus spread

దేశంలో కరోనా విస్తరణను కొంత మేర కట్టడి చేశామని ఊపిరి పీల్చుకునేంతలో... తబ్లిగీ జమాత్ సభ్యుల వల్ల దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు ఊహించని విధంగా పెరిగాయి. ఢిల్లీలోని నిజాముద్దీన్ లో జరిగిన ప్రార్థనలకు వెళ్లిన జమాత్ సభ్యులు... అక్కడి నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాలకు వెళ్లారు. దీంతో, వీరి వల్ల కరోనా  వైరస్ విపరీతంగా వ్యాపించింది.

ఈ నేపథ్యంలో  ఉత్తరప్రదేశ్ లో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. కరోనాను తబ్లిగీ జమాత్ విస్తరింపజేస్తోందంటూ ప్రయాగ్ రాజ్ నగరంలోని ఓ టీ షాప్ వద్ద ఒక వ్యక్తి విమర్శించాడు. వందలాది మందికి వైరస్ ను అంటించిందంటూ దుయ్యబట్టాడు. ఈ క్రమంలో అతనికి, మరో వ్యక్తికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వెంటనే సదరు వ్యక్తిపై నిందితుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో బాధితుడు అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయాడు. కాల్పులకు తెగబడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఉదయం 9.30 గంటల సమయంలో ఈ దారుణం సంభవించింది.  

ప్రాణాలను కోల్పోయిన వ్యక్తి కుటుంబానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ. 5 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించింది. ఘటన జరిగిన ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరగకుండా భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఈ ఘటనతో సంబంధం ఉందని భావిస్తున్న ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. మరోవైపు నిందితుడికి కానీ, మృతుడికి కానీ జమాత్ తో సంబంధం  లేదని చెప్పారు.