32 గిగావాట్లు తగ్గిన విద్యుత్ డిమాండ్... నిలబడిన గ్రిడ్!

06-04-2020 Mon 08:03
  • దీపాలు వెలిగించిన వేళ అధికారుల అప్రమత్తత
  • తగ్గుతున్న డిమాండ్ కు అనుగుణంగా చర్యలు
  • గ్రిడ్ కుప్పకూలకుండా జాగ్రత్తలు
  • అధికారులను అభినందించిన కేంద్రం
Power Grid Holds After Lights Switch Off Last night

నిన్న రాత్రి దీపాలను వెలిగించే సమయంలో.. దేశవ్యాప్తంగా ఇళ్లలోని ఎలక్ట్రిక్ లైట్లను ఆర్పివేసిన వేళ, ముందుగా భయపడినట్టు విద్యుత్ గ్రిడ్ కుప్పకూలలేదు. ఈ విషయంలో తీసుకున్న ముందు జాగ్రత్తలు ఫలించాయి. వీధి దీపాలను ఆన్ చేసి వుండటం, ఇళ్లలోని ఫ్యాన్ లు, ఏసీ మెషీన్లను ఆన్ లోనే ఉంచడంతో గ్రిడ్ నిలబడింది. లాక్ డౌన్ అమలులోకి వచ్చిన తరువాత ఇండియాలో 117 గిగావాట్ల విద్యుత్ కు డిమాండ్ ఉండగా, అది, నిన్న రాత్రి 9 గంటల సమయంలో ఒక్కసారిగా 27 శాతం తగ్గి 85 గిగావాట్లకు పడిపోయింది.

నిన్న ఉదయం నుంచే నేషనల్ నెట్ వర్క్ పై, ముఖ్యంగా ఉత్తరాది రీజియన్ గ్రిడ్ పై నిఘా ఉంచిన గ్రిడ్ ఆపరేటింగ్ సంస్థలు పొసోకో, పవర్ గ్రిడ్, ముందు జాగ్రత్త చర్యగా 50 హెర్జ్ ఫ్రీక్వెన్సీని కొనసాగించారు. దీంతో గ్రిడ్ స్థిరత్వం కొనసాగింది. ఇక, రాత్రి 8.30 గంటల నుంచి గ్రిడ్ ను అనుక్షణం అధికారులు గమనిస్తూనే ఉన్నారు. నెమ్మదిగా తగ్గుతున్న డిమాండ్ ను పరిశీలిస్తే, ఫ్రీక్వెన్సీని స్వల్పంగా తగ్గించేందుకు నిర్ణయించారు. ఎన్ఎల్డీసీ (నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్) ఫ్రీక్వెన్సీని తొలుత 49 హెర్జ్ లకు, ఆపై ఇంకాస్త తగ్గించింది.

ఇక రాత్రి 9.10 గంటల నుంచి ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోతున్న వేళ కూడా అంతే అప్రమత్తతతో ఉన్న అధికారులు, డిమాండ్ 110 గిగావాట్లకు చేరేంత వరకూ గ్రిడ్ వ్యవస్థను కనిపెట్టుకుని ఉన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్, గ్రిడ్ కుప్పకూలకుండా చర్యలు చేపట్టిన అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, టీహెచ్డీసీ, ఇతర జనరేటింగ్ సంస్థలు సమష్టిగా కృషి చేశాయని ఆయన అన్నారు.

కాగా, ఇండియాలోని మొత్తం విద్యుత్ డిమాండ్ 33 శాతం గృహావసరాల నుంచి, 59 శాతం పరిశ్రమలు, వ్యవసాయ రంగాల నుంచి ఉంటుంది. వాణిజ్యపరమైన డిమాండ్ 8 శాతం వరకూ ఉంటుంది. ఇప్పటికే కరోనా కారణంగా పరిశ్రమలు మూతబడగా, విద్యుత్ డిమాండ్ 25 శాతం వరకూ పడిపోయిన సంగతి తెలిసిందే.