ఏపీలో లాక్ డౌన్ వల్ల తగ్గిన నేరాలు.. కనిష్ఠానికి రోడ్డు ప్రమాదాలు!

06-04-2020 Mon 07:46
  • 33 నుంచి 55 శాతం తగ్గిన నేరాలు
  • జన సంచారం తగ్గడం, నిఘా పెరగడమే కారణం
  • లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన కేసులే అత్యధికం
Crime Rate Reduced because of Lockdown

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ అమలవుతున్న వేళ, ఏపీలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. సాధారణ పరిస్థితులతో పోలిస్తే, 33 నుంచి 55 శాతం మేరకు నేరాలు తగ్గాయని పోలీసు వర్గాలు తెలిపాయి. జనసంచారం లేకపోవడమే నేరాలు తగ్గడానికి ప్రధాన కారణమని, అన్ని ప్రాంతాల్లో పోలీసు గస్తీ సాగుతూ, నిఘా పెరగడం మరో కారణమని అధికారులు అంటున్నారు. ఇదే సమయంలో లాక్‌ డౌన్‌ ఉల్లంఘన కేసులు మాత్రం పెరుగుతున్నాయని తెలిపారు. ఇష్టానుసారంగా నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై వివిధ జిల్లాల్లో 4 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.

ఇకఎన్సీఆర్బీ (నేషనల్‌ క్రైమ్ బ్యూరో రికార్డ్స్) 2018తో పోల్చి చూస్తే, ఐపీసీ సెక్షన్ల కింద సగటున నిత్యమూ 383 నేరాలు నమోదు కాగా, లాక్ డౌన్ సమయంలో నేరాల సంఖ్య 33 శాతం తగ్గింది. రోజుకు 254 కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. వీటిల్లో అత్యధికం నిబంధనల ఉల్లంఘనలే. ఇక కిడ్నాపుల విషయానికి వస్తే, గతంలో రోజుకు 5 వరకూ రిజిస్టర్ కాగా, ఇప్పుడా సంఖ్య 2.5కు పడిపోయింది. 2018 లెక్కల ప్రకారం, రోజుకు 2.5 హత్యలు నమోదుకాగా, లాక్ డౌన్ తరువాత ఈ సంఖ్య 1.4కు తగ్గింది.

ఇక మార్చి నెలలో డెకాయిటీ 1, రాబరీ 2, పగటి చోరీలు 2, రాత్రి పూట దొంగతనాలు 17, దొంగతనాలు 153, హత్యలు 14, అల్లర్లు 14, కిడ్నాప్‌ లు 24, లైంగిక దాడులు 8, గాయపరిచిన కేసులు 4, స్వల్ప దాడులు 260, మోసాలు 101, నమ్మక ద్రోహం 12, హత్యాయత్నాలు 18, తీవ్ర రోడ్డు ప్రమాదాలు 48, సాధారణ రోడ్డు ప్రమాదాలు 92, ఐపీసీలోని ఇతర సెక్షన్ల కింద నమోదైన కేసులు 2,546లతో పాటు మరో 1,053 కేసులు నమోదయ్యాయి.

ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రోడ్డు ప్రమాదాల గురించి, గతంలో ఏపీలో సగటున నిత్యమూ 63 రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉండగా, 18 మంది మృత్యువాత పడేవారు. మరో 60 మందికి గాయాలు అవుతుండేవి. మార్చిలో లాక్ డౌన్ మొదలైన తరువాత 140 రోడ్డు ప్రమాదాలే రిజిస్టర్ అయ్యాయి.