Ranga Reddy District: తంగడపల్లి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

Thangadapally murder case investigation going on
  • గత నెల 17న వంతెన కింద లభ్యమైన వివాహిత మృతదేహం
  • పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నందుకు హత్య
  • కారులోనే హత్యాచారం.. పరారీలో అసలు నిందితుడు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లి వంతెన కింద గత నెల 17న లభ్యమైన వివాహిత మృతదేహానికి సంబంధించిన కేసులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇద్దరు యువకులే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది. పెళ్లి చేసుకోమని ఒత్తిడి తేవడంతో పథకం ప్రకారమే ఆమెను హత్యచేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. హత్యకు గురైన మహిళకు వివాహమైంది. అయితే, పెళ్లికి ముందు నుంచే ప్రధాన నిందితుడితో ఆమె ప్రేమలో ఉంది. పెళ్లి తర్వాత కూడా వారి మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగాయి. ఈ క్రమంలో పెళ్లి చేసుకుని దూరంగా వెళ్లిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామని ఆమె పదేపదే ఒత్తిడి చేసింది. అయితే, ఇదే సమయంలో వేరే అమ్మాయికి దగ్గరైన నిందితుడు వివాహితను దూరం పెట్టాడు. అయినప్పటికీ ఆమె నుంచి ఒత్తిడి ఆగకపోవడంతో హత్య చేసి వదిలించుకోవాలని ప్లాన్ చేశాడు.

ప్రణాళిక అమలులో భాగంగా లాంగ్‌డ్రైవ్‌కు వెళ్దామని బాధితురాలిని నమ్మించి అద్దె కారులో ఎక్కించుకున్నాడు. కొంతదూరం వెళ్లిన తర్వాత పోలీసుల అదుపులో ఉన్న నిందితుడితో కలిసి కారులోనే అత్యాచారం చేసి గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం తంగడపల్లి వంతెన వద్దకు చేరుకుని మృతదేహంపై ఉన్న దుస్తులు తొలగించి కిందికి తీసుకొచ్చారు.  ఎవరూ ఆమెను గుర్తుపట్టకుండా బండరాయితో ముఖాన్ని ఛిద్రం చేశారు. అనంతరం గంటపాటు అక్కడే ఉన్న నిందితులు బండరాయిని తమతోపాటు తీసుకెళ్లారు.

 ఎన్కేపల్లి, ప్రగతి రిసార్ట్స్, ప్రొద్దుటూరు మీదుగా నార్సింగి ఇంటర్‌చేంజ్ నుంచి ఔటర్ రింగురోడ్డు మీదికి చేరుకున్నారు. ఈ కేసులో ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్రొద్దుటూరు వద్ద లభించిన సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో కారు జీపీఎస్ కీలకంగా మారింది. పరారీలో ఉన్న అసలు నిందితుడు దొరికితే కేసు చిక్కుముడి పూర్తిగా వీడనుంది.
Ranga Reddy District
Thangadapally
Murder
Crime News

More Telugu News