Hyderabad: కరోనా ఎఫెక్ట్: 18 మందితోనే పెళ్లి కానిచ్చేశారు!

Marriage held in Hyderabad amid coronavirus fears
  • హైదరాబాద్‌లోని ఓల్డ్ బోయిన్‌పల్లిలో ఘటన
  • వధువు ఇంటి వద్ద ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి
  • మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించిన వైనం
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఓ పెళ్లిని మాత్రం అడ్డుకోలేకపోయింది. కాకపోతే ఘనంగా జరగాల్సిన పెళ్లి సాదాసీదాగా జరిగింది. కేవలం 18 మంది సమక్షంలో ఈ పెళ్లి హైదరాబాద్‌లోని ఓల్డ్‌బోయిన్‌పల్లిలో జరిగింది. స్థానిక రాజరాజేశ్వరినగర్‌కు చెందిన నిషిత రెడ్డి, ఎల్‌బీనగర్‌కు చెందిన శ్రీకాంత్‌రెడ్డి వివాహం మూడు నెలల కిందటే నిశ్చయమైంది. నిన్న బోయిన్‌పల్లిలోని ఓ ఫంక్షన్‌హాలులో వీరి పెళ్లి ఘనంగా జరగాల్సి ఉంది.

అయితే, కరోనా వైరస్ భయపెడుతుండడంతో పెళ్లిని వాయిదా వేయాలని అనుకున్నారు. అయితే, ఇప్పట్లో మంచి ముహూర్తం లేకపోవడంతో ఆరేడు నెలలు ఆగాల్సి వస్తుందని భావించిన ఇరు కుటుంబాల సభ్యులు వివాహం జరిపించేందుకే మొగ్గుచూపారు. అయితే, ఫంక్షన్‌హాలులో కాకుండా వధువు ఇంటి వద్దే జరిపించాలని నిశ్చయించారు. వధూవరుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కలిసి మొత్తం 18 మంది సమక్షంలో ముందుగా నిర్ణయించిన ముహూర్తానికే వివాహాన్ని జరిపించారు. ఇందులో ఓ విశేషం కూడా ఉంది. పెళ్లిలో అందరూ మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించి వైరస్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
Hyderabad
Old Bowenpally
Marriage
Corona Virus

More Telugu News