స్పెషల్ స్వీట్ సమోసా 'మునీర్' మృతి.. కరోనాతో కాదంటూ ఫ్లెక్సీలు!

05-04-2020 Sun 20:56
  • శుక్రవారం చీరాలలో మునీర్ అనే వృద్ధుడు మృతి
  • కరోనాతో చనిపోయాడని అనుమానిస్తున్న కొందరు వ్యక్తులు
  • కిడ్నీ ఫెయిల్యూర్ వల్లే చనిపోయారంటూ ఫ్లెక్సీలు
Speacial sweet samosa Muneer not died with corona flexy at Chirala

మన దేశంపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది . ప్రతి రోజు పెద్ద సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎవరు చనిపోయినా కరోనా వల్లే చనిపోయాడనే అనుమానాలు జనాల్లో కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా చీరాలలో శుక్రవారం నాడు మునీర్ అనే వృద్ధుడు చనిపోయారు. అయితే జనాలు అనుమానంతో చూస్తుండటంతో... మునీర్ మరణం కరోనాతో కాదని ఆయన కుటుంబసభ్యులు ఫ్లెక్సీలు వేయించారు. కరోనా నెగెటివ్ అంటూ వచ్చిన రిపోర్టును కూడా ఫ్లెక్సీలో ప్రింట్ చేయించారు. కిడ్నీ ఫెయిల్యూర్ వల్లే ఆయన చనిపోయారని పేర్కొన్నారు.


కనిగిరికి చెందిన మునీర్... బతుకుదెరువు కోసం 30 ఏళ్ల క్రితం చీరాలకు వచ్చారు. సమోసా వ్యాపారం చేస్తూ లాభాలను సంపాదించాడు. దీంతో, ఇతరులు  కూడా అదే  వ్యాపారాన్ని మొదలుపెట్టారు. దీంతో, మునీర్ కు గిరాకీ తగ్గింది. ఆ తర్వాత కొత్తగా ఏదైనా చేద్దామని ఆలోచించి... జీడిపప్పుతో స్వీట్ సమోసా చేయడాన్ని ప్రారంభించారు. దీని రుచికి చీరాల వాసులు బాగా ఆకర్షితులయ్యారు. కొన్ని రోజుల తర్వాత చీరాల స్వీట్ సమోసాగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ తర్వాత చీరాల స్వీట్ సమోసా అనేది మునీర్ ఇంటి పేరుగా మారిపోయింది.