కరోనా గాలి ద్వారా సోకుతందనడానికి ఆధారాల్లేవు: ఐసీఎంఆర్

05-04-2020 Sun 19:13
  • కరోనా వస్తువులు, స్పర్శ, తుంపర్ల ద్వారానే సోకుతుందని వెల్లడి
  • ఈ వైరస్ గాల్లో ప్రయాణించలేదని స్పష్టీకరణ
  • భారత్ లో 3 వేలు దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య
ICMR Scientist tells there is no evidence that corona an airborne virus

భారత్ లో కరోనా కలకలం పెరిగిన తర్వాత ప్రజలు ఎక్కువగా మాస్కులు, ఇతర వస్త్రాలు కట్టుకుని కనిపిస్తున్నారు. అయితే కరోనా గాలి ద్వారా వ్యాపించే వైరస్ కాదని, ఇది గాలి ద్వారా సోకుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సీనియర్ సైంటిస్తు డాక్టర్ రామన్ గంగాఖేద్కర్ తెలిపారు. కరోనా వైరస్ ప్రధానంగా వస్తువులు, స్పర్శ, నోటి నుంచి వచ్చే తుంపర్లు, తుమ్ముల ద్వారా వచ్చే తుంపర్ల కారణంగానే సోకుతుందని, అంతేతప్ప ఈ వైరస్ గాల్లో ప్రయాణించదని స్పష్టం చేశారు.

అటు, కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ, గత కొన్నిరోజులుగా భారత్ లో కేసుల సంఖ్య వేగంగా పెరగడం పట్ల వివరణ ఇచ్చారు. 4.1 రోజుల్లో కేసుల సంఖ్య రెట్టింపైందని అన్నారు. తబ్లిగీ జమాత్ సమావేశాలు జరగకుండా ఉంటే కేసులు రెట్టింపవడానికి 7.4 రోజులు పట్టేదని, కానీ ఆ సమావేశం జరగడంతో కరోనా వ్యాప్తి బాగా పెరిగిందని వివరించారు. ప్రస్తుతం భారత్ లో పాజిటివ్ కేసుల సంఖ్య 3,374 కాగా, మరణాల సంఖ్య 79కి పెరిగింది.