కరోనాతో పోరాడుతూ నిమిషాల వ్యవధిలో మరణించిన దంపతులు

05-04-2020 Sun 18:17
  • అమెరికాలో విషాద ఘటన
  • మార్చి నెలలో కరోనా బారినపడిన వృద్ధ దంపతులు
  • చికిత్స పొందుతూ కన్నుమూత
Old age couple died due to corona in US

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ కరాళనృత్యం చేస్తోంది. 3 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు, వేల సంఖ్యలో మరణాలతో అమెరికా అల్లాడిపోతోంది. తాజాగా, ఫ్లోరిడాకు చెందిన వృద్ధ దంపతులు కరోనా చికిత్స పొందుతూ నిమిషాల వ్యవధిలో చనిపోవడంతో అందరినీ కలచివేస్తోంది. 74 ఏళ్ల స్టూవర్ట్ బేకర్, 72 ఏళ్ల ఆడ్రియన్ బేకర్ భార్యాభర్తలు. వీరికి ఐదు దశాబ్దాల కిందట వివాహం జరిగింది. వీరికి బడ్డీ బేకర్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే స్టూవర్ట్, ఆడ్రియన్ దంపతులు మార్చి నెలలో కరోనా బారినపడ్డారు.

మొదట భర్తకు కరోనా సోకింది. ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నా వైరస్ లక్షణాలు ముదరడంతో ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత భార్యకు కూడా కరోనా సోకింది. వృద్ధులు కావడంతో కరోనా చికిత్సకు తట్టుకోలేకపోయారు. ఇద్దరి అంతర్గత అవయవాలు విఫలం అయ్యాయి. మరో ఆసుపత్రికి తరలించినా ప్రయోజనంలేకపోయింది. ఒకరి తర్వాత ఒకరు 6 నిమిషాల వ్యవధిలో ఈ లోకాన్ని విడిచారు. దాంతో వారి కుమారుడు బడ్డీ బేకర్ తీవ్ర విషాదంలో మునిగిపోయాడు.