Corona Virus: అమెరికా పరిస్థితి ఎందుకిలా తయారైంది?... న్యూయార్క్ టైమ్స్ ఆసక్తికర కథనం

New York Times interesting story on worse situation in US
  • చైనా నుంచి అమెరికా చేరుకున్న 4.30 లక్షల మంది
  • వుహాన్ నుంచి వేల సంఖ్యలో వచ్చిన వ్యక్తులు
  • ప్రయాణ ఆంక్షలు విధించడంలో ట్రంప్ విఫలమయ్యాడంటూ కథనం
ప్రపంచంలోనే అత్యధికంగా అగ్రరాజ్యం అమెరికాలో 3 లక్షల పైచిలుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 1100 మంది మరణించడం అమెరికా ప్రస్తుతం ఎలాంటి దుస్థితిలో చిక్కుకుందో చెబుతోంది. అమెరికాలో కరోనా మహమ్మారి అత్యంత వేగంగా పాకిపోవడం పట్ల న్యూయార్క్ టైమ్స్ మీడియా సంస్థ ప్రత్యేక కథనంలో వివరించింది.

చైనాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న తరుణంలో అమెరికాలో ప్రయాణాలపై ఆంక్షలు లేవు. దాంతో చైనా నుంచి కొన్నివారాల వ్యవధిలోనే 4.30 లక్షల మంది అమెరికాలో అడుగుపెట్టారు. వీరు 1300 విమాన సర్వీసుల ద్వారా అమెరికాలోని అనేక నగరాలకు చేరుకున్నారు.  

వారిలో వుహాన్ నుంచి వచ్చినవారు వేలల్లో ఉన్నారట. కరోనా వైరస్ కు జన్మస్థానం వుహాన్ నగరం అని తెలిసిందే. చైనా నుంచి వచ్చే ప్రయాణికులను తనిఖీ చేయడంలో అమెరికా అప్రమత్తత పాటించకపోవడం కూడా వైరస్ వ్యాప్తికి కారణమైందని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ఇదంతా జనవరి మాసంలో మొదటి రెండు వారాల్లోనే జరిగిందని, అప్పటివరకు చైనా నుంచి అమెరికా వచ్చే వారికి ఎలాంటి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించలేదని వివరించింది.

ఆ తర్వాత చివరి రెండు వారాల్లో అమెరికా అధికార యంత్రాంగంలో కదలిక వచ్చిందని, కేవలం మూడు విమానాశ్రయాల్లోనే అది కూడా వుహాన్ నుంచి వచ్చినవారినే స్క్రీనింగ్ చేశారని తెలిపింది. ప్రయాణ ఆంక్షలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినంగా వ్యవహరించకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని న్యూయార్క్ టైమ్స్ విమర్శించింది.
Corona Virus
USA
China
Wuhan
New York Times
Donald Trump

More Telugu News