పేదల అసైన్డ్ భూములను లాక్కుని వేలాది కుటుంబాల పొట్టకొట్టడం ఆవేదనకు గురిచేస్తోంది: చంద్రబాబు

05-04-2020 Sun 13:21
  • ఈ రోజు జగజ్జీవన్ రామ్ జయంతి 
  • 11 నెలలుగా దళితుల సంక్షేమం గాలికొదిలేయడం బాధాకరం
  • ఎస్సీల నిధులను దారిమళ్లించి రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాశారు
chandrababu fires on ap govt

భారత మాజీ ఉప ప్రధాని కీ.శే.బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని ‘సమతావాదం’ ఆదర్శంగా దళితాభ్యుదయానికి పునరంకితం అవుదామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ‘సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లని’ చాటుదామని చెప్పారు.

'దేశానికే దిశానిర్దేశం చేసే లోక్ సభ స్పీకర్ గా ఒక దళితనేతను చేసిన పార్టీ తెలుగుదేశం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి మహిళా స్పీకర్ గా ఒక దళిత మహిళానేతను గౌరవించిన పార్టీ తెలుగుదేశం. బడుగు, బలహీన వర్గాలను రాజ్యాధికారంలో భాగస్వాములను చేసిన పార్టీ తెలుగుదేశం' అని ఆయన చెప్పారు.  

'అంబేద్కర్, జగజ్జీవన్ రామ్, జ్యోతిరావ్ పూలే వంటి మహాశయుల లక్ష్యాల సాధన కోసం అంకితమైన పార్టీ తెలుగుదేశం. గత ఐదేళ్ల పాలనా కాలంలోనూ ఎస్సీల అభ్యున్నతికి ఎంతో కృషిచేశాం' అని చెప్పారు.

'పేద ఎస్సీ ఆడబిడ్డ పెళ్లికి రూ.40 వేలు పెళ్లి కానుకగా ఇచ్చాం. ఎస్సీ విద్యార్థుల విదేశీ చదువులకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాం. ‘జ్ఞానభూమి’ ద్వారా లక్షలాది విద్యార్థలకు ఫీజు రీయింబర్స్ మెంటు, ఉపకారవేతనాలు ఇచ్చాం' అని తెలిపారు.  
 
‘జగ్జీవన్ జ్యోతి’ పథకం కింద ఎస్సీల ఇళ్ళకు 100 యూనిట్ల ఉచిత కరెంటు ఇచ్చాం. డప్పు కళాకారులకు ప్రతి నెలా రూ.1,500 పింఛను ఇచ్చాం. ఎస్సీల సంక్షేమానికి 4ఏళ్లలోనే రూ.40,253 కోట్ల బడ్జెట్ పెట్టాం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 6.56 లక్షల మందికి జీవనోపాధులు కల్పించాం' అని ట్వీట్ చేశారు.  
 
'ఎస్సీ యువత స్వయం ఉపాధి కోసం ఇన్నోవాలు, జేసీబీలు, ఇతర వాహనాలు అందించాం. ‘దళితతేజం’ నలుదిశలా విస్తరించాం. అయితే గత 11నెలలుగా దళితుల సంక్షేమం గాలికొదిలేయడం బాధాకరం. ఎస్సీల నిధులను దారిమళ్లించి రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాశారు' అని విమర్శించారు.  

'ఇళ్లస్థలాల ముసుగులో, పేదల అసైన్డ్ భూములను లాక్కుని వేలాది దళిత కుటుంబాల పొట్టకొట్టడం ఆవేదనకు గురిచేస్తోంది' అని తెలిపారు.