బ్రిటన్‌లో నిన్న ఒక్క రోజే 708 మంది మృతి.. మృతుల్లో ఐదేళ్ల చిన్నారి

05-04-2020 Sun 09:53
  • బ్రిటన్‌లో దారుణ పరిస్థితులు
  • నాలుగు వేలు దాటిన మరణాలు
  • నిబంధనలు సడలిస్తే మరింత ప్రమాదమన్న ఆరోగ్యశాఖ కార్యదర్శి
708 people killed in Britain yesterday alone

బ్రిటన్‌లో కరోనా వైరస్ ఉద్ధృతి రోజురోజుకు ఎక్కువవుతోంది. నిన్న ఒక్క రోజే అక్కడ 708 మంది ప్రాణాలు కోల్పోయారు. యూకేలో ఒకే రోజు ఇంతమంది చనిపోవడం ఇదే తొలిసారి. మృతుల్లో ఐదేళ్ల బాలుడు ఉండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇక, దేశ్యాప్తంగా ఇప్పటి వరకు 41,903 మంది వైరస్ బారిన పడగా 4,313 మంది మృతి చెందారు.

నిన్న ఒక్కరోజే బ్రిటన్ వ్యాప్తంగా 3,735 కేసులు నమోదవడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. నిన్న మరణించిన వారిలో 40 మందిలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని ఇంగ్లండ్ నేషనల్ హెల్త్ సర్వీసెస్ పేర్కొంది. దేశంలో మరణాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని ప్రధాని బోరిస్ జాన్సన్ అధికారులను ఆదేశించారు. సామాజిక దూరం పాటించాలన్న నిబంధనలను సడలిస్తే మరింతమంది మృత్యువాత పడే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ కార్యదర్శి మ్యాట్‌ హ్యాన్‌కాక్ పేర్కొన్నారు.