భారత మంత్రి అబద్ధాలు చెప్పారు: ప్రిన్స్ చార్లెస్ కార్యాలయం మండిపాటు

05-04-2020 Sun 09:38
  • ప్రిన్స్ చార్లెస్ కు సోకిన కరోనా
  • ఆయుర్వేద వైద్యం జరిగిందన్న కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్
  • అటువంటిది ఏమీ లేదని స్పష్టం చేసిన బ్రిటన్
Prince Charless Office Denies Ayurveda Treatment for Corona

కరోనా పాజిటివ్ సోకిన బ్రిటన్ పిన్స్ చార్లెస్ కు బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న సౌఖ్యా ఆయుర్వేద రిసార్ట్ సలహా, సూచనల మేరకు ఆయుర్వేద, హోమియోపతి వైద్యం చేయగా, అది విజయవంతమై ఆయన కరోనా నుంచి బయటపడ్డారని కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్ చేసిన వ్యాఖ్యలను ప్రిన్స్ కార్యాలయం తీవ్రంగా ఖండించింది. భారత మంత్రి చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని స్పష్టం చేసింది. ప్రస్తుతం చార్లెస్ సెల్ఫ్ ఐసొలేషన్ నుంచి బయటకు వచ్చారని, ఎన్.హెచ్.ఎస్ సలహా మీద ఆయనకు వైద్య చికిత్స జరిగిందని, ఆయన కోలుకున్నారని చార్లెస్ కార్యాలయం తెలిపింది.

"ఈ సమాచారం అవాస్తవం. యూకే ఆరోగ్య అధికారుల సలహా మేరకే ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కు వైద్య చికిత్స జరిగింది" అని చార్లెస్ కార్యాలయం ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. కాగా, 71 ఏళ్ల వయసున్న ప్రిన్స్ చార్లెస్, ఈ నెలారంభంలో కరోనా బారిన పడి, అప్పటి నుంచి హోమ్ ఐసొలేషన్ లో ఉంటూ, చికిత్స పొందిన సంగతి తెలిసిందే. వాస్తవానికి చార్లెస్ కు ఆయుర్వేద వైద్యంపై మంచి నమ్మకం ఉంది. ఏప్రిల్ 2018లో భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించి, లండన్ లో ఓ కొత్త ఆయుర్వేదిక్ సీఓఈ (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్)ను కూడా ఆయన ప్రారంభింపజేశారు. యోగా, ఆయుర్వేద వైద్య విజ్ఞానంలో శాస్త్ర సమ్మత పరిశోధనలు చేయడమే ఈ కేంద్రం స్థాపన వెనుక ముఖ్య ఉద్దేశం.

ఇక సౌఖ్య, అఫీషియల్ వెబ్ సైట్ సైతం చార్లెస్ పేరును పలుమార్లు తమ ప్రచారానికి వాడుకోవడం గమనార్హం. "చార్లెస్, కామిల్లా వంటి రాయల్ వీఐపీ కస్టమర్లు సౌఖ్యాకు ఉన్నారని మీకు తెలుసు. ఎంతో ప్రమాదకరమైన వ్యాధులకు సైతం చికిత్సను అందిస్తున్నాం" అని పేర్కొంది. అయితే, చార్లెస్ కు జరిగిన ప్రత్యక్ష చికిత్సలో తమకు సంబంధం ఉందని మాత్రం సెంటర్ చెప్పలేదు. కాగా, ప్రస్తుతం చార్లెస్, స్కాట్ లాండ్ లోని తన ఇంట్లో ఉన్నారు.