దేశంలోని కరోనా బాధితుల్లో యువకులే అత్యధికం.. మరణాల్లో వృద్ధులే అధికం!

05-04-2020 Sun 09:22
  • బాధితుల్లో 60 ఏళ్లు, అంతకుమించిన వారి సంఖ్య తక్కువ
  • వైరస్ బారినపడుతున్న వారిలో 83 శాతం మంది 60 ఏళ్లలోపువారే
  • బాధితుల్లో  21 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న వారే అధికం
Young people are the most coronary sufferers in the country

దేశంలో కరోనా వైరస్ బారినపడుతున్న వారిలో అత్యధికులు యుక్త వయసు వారేనని తేలింది. అయితే, అదే సమయంలో వృద్ధులు ఎక్కువగా చనిపోతున్నారని కేంద్రం వెల్లడించిన తాజా గణాంకాల ద్వారా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా మూడువేలకు పైగా కరోనా నిర్ధారిత కేసులు నమోదు కాగా, వారిలో 83 శాతం మంది 60 ఏళ్లలోపు వారే. అందులో 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్నవారి సంఖ్యే ఎక్కువ. 60 ఏళ్లు అంతకుమించి వయసు కలిగిన వారు కేవలం 17 శాతం మందే  ఈ వైరస్ బారినపడినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

ఇక, విదేశాల నుంచి వచ్చిన యువకుల్లో ఎక్కువమంది ఈ వైరస్ బారిన పడ్డారు. వీరంతా చదువు, ఉద్యోగాల కోసం విదేశాలు వెళ్లినవారే. వీరిలోనూ 21 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వారి సంఖ్యే ఎక్కువ. వైరస్ బారినపడిన వారిలో ఈ వయసు వారే ఎక్కువని కేంద్రం ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. మొత్తంగా చూస్తే బాధితుల్లో తక్కువగా ఉన్న వృద్ధుల సంఖ్య.. మరణాల్లో మాత్రం ఎక్కువగా ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.